దోపిడీ, ఆపై తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్
posted on Jul 31, 2016 @ 6:57PM
ఉత్తరప్రదేశ్‌లో దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అడ్డగించి, దోపిడీకి పాల్పడి, తల్లీకూతుళ్లపై సామూహికంగా అత్యాచారం చేశారు దోపిడీ దొంగలు. నోయిడాకు చెందిన ఓ కుటుంబం తమ కారులో షాజహాన్‌పూర్‌కి బయలుదేరింది. ఈ క్రమంలో ఢిల్లీ-కాన్పూర్ హైవేపై వెళుతుండగా బులంద్ షహర్ వద్ద గుర్తుతెలియని వస్తువు ఒకటి కారును ఢీకొట్టింది.
దీంతో కంగారుపడ్డ కుటుంబీకులు వాహనాన్ని ఆపి కిందకి దిగారు. అంతే దాదాపు 10 మంది దుండగులు ఒక్కసారిగా మీదపడ్డారు..షాక్‌కు గురైన ఆ కుటుంబం నుంచి డబ్బు, ఆభరణాలను దోచుకున్న దుండగులు కుటుంబానికి చెందిన మగవారిని చెట్లకు కట్టేసి, మహిళను, ఆమె 14 ఏళ్ల కూతురిని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఎలాగోలా కట్లు విడిపించుకుని అక్కడి నుంచి తప్పించుకున్న ఒక కుటుంబసభ్యుడు జరిగిన దారుణాన్ని బులంద్ షహర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తల్లీకూతుళ్లను ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు, 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.