చంద్రబాబు అలిగితే ఎలా ఉంటుందో తెలుసా.. ఎంపీ
posted on Aug 1, 2016 @ 3:08PM
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఏపీకి న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలగటమే తెలియని నేతని, ఆయన అలిగిన రోజు బీజేపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే టీడీపీకి బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సి వస్తుంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు ధర్మరాజు లాంటి వాడు.. ఆయనకు కోపంకాని.. ఆవేశం కాని అంత త్వరగా రాదు కనుక ఇంకా తలొగ్గి మాట్లాడుతున్నారు.. అలుగుటయే ఎరుగని ఆ అజాతశత్రువు చంద్రబాబునాయుడు.. ఆయన అలిగిన రోజు ఎటువంటి పరిస్థితులు వస్తాయో బీజేపీ వారు అర్థం చేసుకోవాలి" అన్నారు.
ఇప్పటికే రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి దుమారం రేగుతుండగా..ఈరోజు ప్రత్యేక హోదాపై లోక్ సభ మారుమోగిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తీరాల్సిందేనని టీడీపీ, వైసీపీ ఎంపీలు దాదాపు గంటసేపు సభను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.