హనీమూన్‌కు వచ్చిన జంటను కంగారుపెట్టిన చిరుత..
posted on Aug 1, 2016 @ 9:55AM
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ప్రేమికులు, ప్రకృతి ప్రియులకు ఒక అద్భుత విహార కేంద్రం. అలాగే కొత్తగా పెళ్లయిన జంటలకు ఫస్ట్ హనీమూన్ ఛాయిస్. సుమిత్, శివానిలకు కొత్తగా పెళ్లయింది..మ్యారేజ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి హనీమూన్ స్పాట్‌గా నైనిటాల్‌ను ఎంచుకుంది ఈ జంట. అక్కడున్న వాటిలో మంచి హోటల్ ఒకదాంట్లో గది బుక్ చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున ఉన్నట్లుండి పెద్ద శబ్ధం వచ్చింది.
ఏంటా అని చూస్తే..బాత్రూంలో చిరుతపులి..అంతే ఆ జంట పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే వీళ్లను చూడగానే మీద పడుతుందేమోనుకుంటే అది మాత్రం భయం భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. షాక్ నుంచి తేరుకున్న భర్త బాత్రూం తలుపు గడియ పెట్టి హోటల్ యాజమాన్యానికి విషయం చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు అటవీ శాఖాధికారులతో పాటు హోటల్‌కు వచ్చారు. అయితే వారు వచ్చే లోపలే చిరుత ఎలాగోలా పారిపోయింది. చిరుతను చూసి కాస్త భయపడినా దానిని అంత దగ్గర నుంచి చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ జంట చెప్పింది.