మోత్కుపల్లికి నిరాశే.. ఒకే ఒక్క ఛాన్స్
posted on Aug 18, 2016 @ 11:51AM
మణిపూర్, పంజాబ్, అసోం రాష్ట్రాలకు గాను గవర్నర్లను నియమిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గవర్నర్ల నియామకంపై అందరి సంగతేమో కానీ.. ముఖ్యంగా తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లికి మాత్రం నిరాశే మిగిలింది. ఎందుకంటే ఎప్పటినుండో మోత్కుపల్లి గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకున్నసంగతి తెలిసిందే. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మోత్కుపల్లికి ఆ పదవి విషయంపై బహిరంగంగానే తెలిపారు. దీంతో మోత్కుపల్లితో పాటు అందరూ గవర్నర్ పదవి మోత్కుపల్లికి ఖాయం అనుకున్నారు. కానీ సీన్ కాస్త రివర్స్ అయి మోత్కుపల్లి నియామకం కాలేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడే మోత్కుపల్లి పేరును.. ప్రధాని ముందు ఉంచినా ఈసారి మాత్రం మోత్కుపల్లికి అవకాశం రాలేదు.
ఇక మోత్కుపల్లి గవర్నర్ల నియామకంపై స్పందించి ‘‘నన్ను గవర్నర్‌ను చేస్తారన్న విషయం నాక్కూడా తెలియదు. నువ్వు ఏ క్షణాన్నయినా గవర్నర్ అయ్యే అవకాశం ఉందని గతేడాది మా బాస్ చెప్పినప్పుడు నాకు తెలిసింది. అయితే టీడీపీ నేతలకు ఎందుకు పదవులు రావడం లేదో మాత్రం నాకు తెలియడం లేదు’’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.
అయితే మోత్కుపల్లి ఇక మిగిలింది ఒకే ఒక్క ఛాన్స్. అది కూడా తమిళనాడు గవర్నర్ పదవి. వచ్చే ఏడాదితో రోశయ్య పదవికాలం ముగియనుండడంతో ఆస్థానం ఖాళీగా ఉంటుంది. అయితే అది కూడా చాలా కష్టమే అని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ రోశయ్యనే గవర్నర్ గా కొనసాగించాలని అనుకుంటున్నారు. మరోవైపు బీజేపీ ఈసారి కర్ణాటక సీనియర్ డీహెచ్ శంకరమూర్తిని గవర్నర్ గా నియమించాలని చూస్తుంది. మరి వీరిద్దరి కాదని ఆ పదవి మోత్కుపల్లి వరకూ రావడమంటే కష్టమైన విషయమే. మరి మోత్కుపల్లి అదృష్టం ఎంతవరకూ ఉందో చూడాలి...