ఎస్ఐ ఆత్మహత్య.. వేధింపులు భరించలేకే..
posted on Aug 17, 2016 @ 10:35AM
ఈమధ్య కాలంలో పోలీసు ఉన్నతాధికారులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎక్కువగా వింటున్నాం. మరి పై అధికారుల ఒత్తిడి వల్లనో.. లేక వ్యక్తిగత కారణాలవల్లనో తెలీదు కానీ ఇప్పటివరకూ చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. మెదక్ జిల్లాకు చెందిన ఎస్ఐ రామకృష్ణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా, కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి నిన్న రాత్రి పోలీస్ క్వార్టర్స్ లోనే తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అక్కడ పోలీసులకి ఓ సూసైడ్ నోట్ లభించినట్టు తెలుస్తోంది. అందులో ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఓ సీఐ, ఓ డీఎస్పీ తనని వసూళ్ల కోసం వేధించారని తెలిపారు.
మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఆయన భార్య ఆరోపిస్తున్నారు. రామకృష్ణకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతని స్వగ్రామం నల్లగొండ జిల్లాలోని మఠంపల్లిలోని బక్కమంత్రగూడెం. ఎస్ ఐ మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అధికారుల వేధింపులపై దర్యాప్తు సాగుతోంది.