కన్య్ఫూజన్ లో కేసీఆర్...
posted on Aug 23, 2016 @ 11:28AM
పి.వి సింధూ.. గత మూడు నాలుగు రోజుల నుండి వినిపిస్తున్న పేరు ఇదే. రియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచి ఇండియా పేరు ప్రతిష్టలు నిలబెట్టి.. త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన సింధూపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు సింధూకు రివార్డులు ఇవ్వడంలో ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ఒక్క మన తెలుగు రాష్ట్రాలేనా.. పక్క రాష్ట్రాలు కూడా సింధూకు నజరానా ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం రూ.3కోట్ల రూపాయలు నజరానా.. రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలం.. ఓ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాయి. ఇక అన్నింటిలో పోటీ పడే కేసీఆర్.. ఈసారి కూడా తన మార్క్ చూపించారు. ఒక అడుగు ముందుకేసి.. సింధూకి రూ. 5కోట్ల నజరానా.. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీ సమీపంలో ఇంటి నిర్మాణం కోసం వేయి గజాల స్థలం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్న ఇప్పుడు కేసీఆర్ ఓ కన్య్ఫూజన్ లో పడ్డారు.
ఈ కన్ప్యూజన్ ఎందుకంటే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గురించి. ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పి.వి సింధూను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి తోడు ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ సైతం సింధూను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని అన్నారు. అంతేకాదు ‘బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్కరే ఉండాలని ఏం లేదు కనుక.. ఇద్దరినైనా ప్రకటించవచ్చు’ .. సింధూ భవిష్యత్‌లో తప్పక స్వర్ణపతకాన్ని సాధిస్తుందనే నమ్మకం నాకుంది అని అన్నారు. మరోవైపు చాముండేశ్వరనాథ్ సానియా మీర్జాకు కూడా చాలా సన్నిహితులు. అలాంచిది ఆయనే ఇలాంటి ప్రతిపాదన తేవడంతో ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..