పోలీసుల ఎదుట లొంగిపోయిన మోహన్ రెడ్డి..
posted on Aug 23, 2016 @ 12:56PM
గత కొద్దినెలల క్రిందట తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఉందతంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే మోహన్ రెడ్డి పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోటు తాజాగా గ్యాంగ్ స్టర్ నయీమ్ తో కూడా మోహన్ రెడ్దికి సంబంధాలు ఉన్నాయని బయటపడింది. బెజ్జంకి మండలం గుండ్లపల్లికి చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం.. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి తన స్థలాన్ని తిరిగి ఇవ్వడం లేదని ఆయన వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ లభించడంతో కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణరెడ్డి బంధువులు మోహన్ రెడ్డికి నయీంతో సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో అప్పటినుండి మోహన్ రెడ్డి కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిన్న రాత్రి ఆయన ఓ న్యాయవాదితో పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. దీంతో మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు కరీంనగర్ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.