కాశ్మీర్ అల్లర్ల ఫలితం.. ఆరువేల కోట్ల నష్టం..
posted on Aug 24, 2016 @ 11:22AM
హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన కాశ్మీర్ కాస్త హింసాత్మకంగా మారింది. ఇప్పటికే గత నెలరోజుల పైనుండి ఇక్కడ భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. అయినా కానీ అప్పుడప్పుడు అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రామిక జీవులకు తిండి గగనమైంది. పస్తులతో వారు అలమటించిపోతున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇదంతా ఒకటైతే.. ఇప్పుడు ఈ అల్లర్ల వల్ల కాశ్మీర్లో వ్యాపార రంగానికి భారీగానే గండిపడినట్టు తెలుస్తోంది. దాదాపు 45 రోజుల నుండి జరుగుతున్న ఈ అల్లర్ల వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరువేల కోట్ల రూపాయలు నష్టం వాటినట్టు సమాచారం. రోజుకు దాదాపు రూ.135 కోట్ల చొప్పున నష్టపోతున్నట్టు కశ్మీర్ ట్రేడర్స్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మొహ్మద్ యాసిన్ ఖాన్ తెలిపారు. ఇంతటి సంక్షోభాన్ని తామెప్పుడూ చూడలేదని పేర్కొన్న ఆయన కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి ఇప్పటికైనా కాశ్మీర్ వాసులు కళ్లు తెరుస్తారో లేదో చూడాలి.