చైనా వార్నింగ్ కు భారత్ సమాధానం.. మీ పని మీరు చూసుకోండి
posted on Aug 24, 2016 @ 10:45AM
భారత్ కు చైనాకు ఈ మధ్య అన్ని విషయాల్లో విబేధాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంశాల్లో చైనా, భారత్ ల వ్యవహారం ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టు తయారైంది. ఇప్పుడు మరో విషయంలో భారత్ చైనాకు ధీటైన సమాధానం చెప్పింది. అది బ్రహ్మోస్ క్షిపణుల విషయంలో. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను భారత్ మోహరిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వార్తలకు స్పందించిన చైనా.. అదే కనుక జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఇక చైనా హెచ్చరికలకు స్పందించిన భారత్ కూడా బాగానే ఘాటుగా సమాధానమిచ్చింది. ‘మా భూభాగం, మా భద్రతకు పొంచి ఉన్న ముప్పుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. క్షిపణులు, ఆయుధాలను మా భూభాగంలో ఎక్కడ మోహరించాలన్న విషయాన్ని చైనా ప్రభావితం చేయజాలదు’’ తామేం చేయాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని, తమకు తెలుసని చెప్పింది.
కాగా భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులంటే చైనాకు మొదటి నుంచీ వణుకే. వీటిని జలాంతర్గాములు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, భూతలం నుంచి కూడా ప్రయోగించే వీలుండడమే ఇందుకు కారణం. 300 కిలోల అణువార్‌హెడ్లను మోసుకెళ్లగలిగే ఈ క్షిపణులు 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలవు.