అశ్లీల నృత్యాలుంటేనే ప్రజలు మెలకువగా ఉంటారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

  సంచలన వ్యాఖ్యలు చేయడంలో రాజకీయ నేతలు తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆవేశంలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానిస్తారు.. తరువాత చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ కులస్తే కూడా సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ నయిన్ పూర్ జిల్లాలో పిప్రియో గ్రామంలో  గోండు రాజులు శంకర్ షా, రఘునాథ్ షా సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కులస్తే ను అతిధిగా పిలవగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఛత్తీస్ గఢ్ నుంచి డ్యాన్సర్లను రప్పించి మరీ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆసక్తిగా తిలకించిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిలో ఇలాంటి డాన్సులు భాగమని, ప్రజలు కూడా వీటిని బాగా ఇష్టపడుతున్నారని.. రాత్రుళ్లు ప్రజలు మెలకువగా ఉండాలంటే ఇలాంటి డ్యాన్స్‌ ప్రదర్శనలు అవసరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.

మాకు నచ్చిన చోట దాడి చేస్తాం.. భారత్ కు వార్నింగ్

  భారత్ కు పాకిస్థాన్ ఎప్పుడూ పక్కలో బల్లెంలాగానే ఉంటుంది అన్న సత్యం అందరికి తెలిసిందే. మనం ఒకటి అంటే పాకిస్థాన్ మరొకటి అనడం అలవాటే. ఆ విషయం ఇప్పటికి చాలాసార్లు రుజువైంది. తాజాగా పాకిస్థాన్ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. గత రెండు నెలలకు పైగా కాశ్మీర్లో అల్లర్లు చెలరెగుతున్న సంగతి తెలిసిందే. దీనికికాను.. ఆయన కశ్మీర్లో ఎవరు దాడి చేసిన తమనే(పాకిస్థాన్నే) బాధ్యులుగా చేయడం భారత్ కు అలవాటైపోయిందని యూరీ సెక్టార్లో దాడికి సంబంధించి తమపై భారత్ ఎలాంటి మిలిటరీ చర్యలు తీసుకున్నా 'ఇప్పుడు మీరు (భారత్) మీకు నచ్చిన చోటును ఎంపిక చేసుకొని దాడి చేస్తే మేం కూడా మాకు నచ్చిన చోట, నచ్చిన సమయంలో దాడి చేస్తాం' అంటూ హెచ్చరించారు. ప్రస్తుత దాడులకు సంబంధించి భారత్ మిలటరీ యాక్షన్ తో ప్రతీకారం తీల్చుకోవాల్సిందే అంటున్న డీజీఎంవో, డిఫెన్స్ మినిస్టర్ ఒక్కసారి జరుగుతున్న పరిణామాలు ఏమిటో అర్థం చేసుకుంటే మంచిదంటూ వ్యాఖ్యానించారు.   యూరీ దాడికి పాల్పడిన ఆయుధాలు, పేలుడు సామాగ్రి మొత్తం పాక్ నుంచే వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి కదా అని మీడియా ప్రశ్నించగా ప్రపంచంలోని ఏ ప్రాంతంలో నుంచైనా ఎవరైనా ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని తాఫీగా సెలవిచ్చాడు. ఆయుధాలు అక్కడివే అయినా.. ఆ దాడికి పాల్పడినవారు పాక్ నుంచే వచ్చారనడానికి ఆధారాలు లేవు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు.   కాగా, యూరి సెక్టర్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. లాచిపుర ప్రాంతంలో దాడులకు దిగిన ఉగ్రవాదులను భారత సైన్యం ఏరిపారేసింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పదిమంది ఉగ్రవాదులు మరణించారు.

టీడీపీ విలీనంపై కోర్టు.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి

  టీఆర్ఎస్ లో టీడీపీ విలీనంపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ పై తెలంగాణ రాష్ట్ర సమితిలో టీడీఎల్పీని విలీనం చేయడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ మధుసూదనాచారిని ఆదేశించింది. టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ప్రారంభమై, ఎర్రబెల్లి, కడియం వంటి కీలక నేతలంతా ఫిరాయించిన వేళ, తెలంగాణ తెలుగుదేశం విభాగాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక్కడే లేవు వాళ్లకేం ఇస్తాం.. సిద్ద రామయ్య

  కావేరి నీటి జలాల వివాదం మళ్లీ మొదటికే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో వాతావరణం కాస్త నెమ్మదిస్తుంది అనే లోపులోనే సుప్రీం కోర్టు తాజా తీర్పుతో అగ్నికి ఆజ్యం పోస్తున్నంత పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో కావేరి నీటిని 15 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించగా.. ఆతరువాత కర్ణాటకలో ఏర్పడిన ఆందోళనల నేపథ్యంలో 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే దీనిలో భాగంగా తమిళనాడుకు రోజుకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదలాలని సూచించగా.. అందుకు కోర్టు రోజుకు 6 వేల క్యూసేక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో సీఎం సిద్దరామయ్య సైతం సుప్రీం తీర్పుపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కావేరి నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆదేశాలను ఎలా అమలు చేయగలుగుతామని అన్నారు. కోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని.. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. మరోవైపు సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

భాగ్యనగరిలో భయానక పరిస్థితి..స్కూళ్లకు సెలవులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి భయానకంగా మారింది. దాదాపు 40కి పైగా కాలనీలు, వరద నీటిలో మునిగిపోయాయి, పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మెహదీపట్నం, సనత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హైదరాబాద్‌లో వర్షబీభత్సంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. తక్షణం పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి ప్రజలకు సాయపడాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే సైన్యం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను వారికి అందించాలని, ముంపు ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహించేందుకు సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు.

సుప్రీంలో కర్ణాటకకు మరోసారి ఎదురుదెబ్బ..

కావేరి జలాల వివాదం విషయంలో కర్ణాటకకు మరోసారి భంగపాటు తప్పలేదు. కర్ణాటక, తమిళనాడు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన కావేరి నదీ జలాల వివాదం కేసులో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును వెలువరించిన ధర్మాసనం..కావేరి జలాల్లో తమిళనాడుకు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు రోజుకు మూడు వేల క్యూసెక్కుల కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలన్న కావేరి పర్యవేక్షక సమితి ఆదేశాలపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాదనలు వినిపించాయి.   తమ రాష్ట్రం తమిళనాడు కోసం నీటిని త్యాగం చేస్తోందని కర్ణాటక న్యాయవాది వాదించారు. తమిళనాడులో తీవ్ర నీటికొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. అలాగే నాలుగు వారాల్లోగా కావేరి నదీ యజమాన్య బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరో 27 స్మార్ట్ నగరాల ప్రకటన..జాబితాలో తిరుపతి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇవాళ మరో జాబితాను ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు 27 నగరాలతో కూడిన కొత్త నగరాల జాబితాను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 నగరాలను ఎంపిక చేయాలని నిర్ణయించిన కేంద్రం ఈ ఏడాది మే నెలలో 13 నగరాలను ప్రకటించింది. మిగిలిన 27 నగరాలను ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి స్థానం లభించింది. జాబితాలో ఉన్న నగరాలు ఇవే: ఆగ్రా, అజ్మీర్, అమృత్‌సర్, ఔరంగాబాద్, గ్వాలియర్, హుబ్లీ-దార్వాడ్, జలంధర్, కళ్యాణ్-బొంబ్వాలి, కాన్పూర్, కోహిమా, కోటా, మధురై, మంగుళూరు, నాగపూర్, నామ్‌చి, నాసిక్, రూర్కెలా, సేలం, షీమోగా, థానే, తంజావూర్, తిరుపతి, తుముకూరు, ఉజ్జయిని, వడోదరా, వెల్లూరు, వారణాసి 

కశ్మీర్‌లో 74 రోజుల కర్ఫ్యూకి తెర..

సుమారు 74 రోజుల పాటు కశ్మీర్‌ లోయలో అమల్లో ఉన్న కర్ఫ్యూకి తెరపడింది. శ్రీనగర్‌లోని ఆరు పోలీస్ స్టేషన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఇవాళ్టీ నుంచి కర్ఫ్యూని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీని సైన్యం హతమార్చడంతో కశ్మీర్‌ లోయలో హింస చేలరేగింది. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. దీంతో ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 81 మంది మృతి చెందగా, వారిలో ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. వేలాది మంది పౌరులు ఉన్నారు. అయితే పరిస్థితులు కొంచెం మెరుగుపడటంతో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచారు. విద్యా, వ్యాపార సంస్థలను పెట్రోల్ దుకాణాలను కొన్నింటిని ఇంకా మూసివేసే ఉంచారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను మాత్రం ఇంకా అనుమతించలేదు.

30 సార్లు పొడిచి పొడిచి చంపాడు..

దేశంలో ప్రేమోన్మాదుల దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న మెదక్ జిల్లా సదాశివపేటలో ప్రేమను నిరాకరించిందని ఓ విద్యార్ధినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన మరచిపోకముందే దేశ రాజధానిలో మరో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో ఓ టీచర్‌‌ను అత్యంత పాశవికంగా 30 సార్లు పొడిచి పొడిచి చంపాడు. ఉత్తర ఢిల్లీలో కరుణ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది...34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమించమంటూ తరచూ వెంటాడి, వేధిస్తుండేవాడు. అయితే అతని ప్రేమను కరుణ కాదనడంతో కక్ష పెంచుకున్నాడు సురేందర్. ఈ నేపథ్యంలో ఇవాళ రోడ్డుపై వెళుతున్న కరుణను అందరూ చూస్తుండగానే పొడిచి పొడిచి చంపాడు. చనిపోయింది అని నిర్థారించుకున్న తర్వాత అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కరుణని సురేందర్ సంవత్సరం నుంచి వేధిస్తున్నాడని..దీనిపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం.   ;

క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆరోడీవో..

ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్ రేంజ్ క్షిపణిని భారత్ ఇవాళ విజయవంతంగా ప్రకటించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా రూపొందించాయి. ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్ అండ్ త్రెట్ అలర్ట్ రాడార్(ఎంఎఫ్-స్టార్) సిస్టమ్ ఉంటుంది. యూరీలో భారత సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపధ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. 

న్యూయార్క్ పేలుళ్ల ఉగ్రవాదిని పట్టించిన భారతీయుడు

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీల్లో జరిగిన బాంబు దాడులు అగ్రరాజ్యాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఈ ఘటనతో ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలకు గురయ్యారు. అటు ఈ దాడులకు కారణమైన 28 ఏళ్ల అఫ్గన్ సంతతి అమెరికన్ పౌరుడైన అహ్మద్ ఖాన్ రహామీ కోసం పోలీసులు, ఎఫ్‌బీఐ, ఇలా అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇంతలా శ్రమిస్తున్నా..దేశం మొత్తం హైఅలర్ట్ ప్రకటించినా ఫలితం శూన్యం. అంతమంది శోధించినా దొరకని వ్యక్తిని ఒక భారతీయుడు గుర్తించాడు. హరిందర్ బెయిన్స్ అనే భారతీయుడు. లిండన్‌లోని ఓ బార్‌కు యజమాని అయిన హరిందర్ బార్‌లో వార్తలు చూస్తున్నాడు. అప్పటికే పోలీసులు అనుమానితుడి ఫోటోను విడుదల చేయడంతో హరిందర్ చూపు తన ముందు నుంచి వెళుతున్న వ్యక్తిపై పడింది. కాస్త అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులను చూడగానే ఆ ఉగ్రవాది కాల్పులకు దిగాడు. వారు కూడా ఎదురు కాల్పులకు దిగి ఎట్టకేలకు ఉగ్రవాదిని బంధించగలిగారు. ఈ ఘటనతో హరిందర్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అక్కడి పోలీసులతో పాటు సాధారణ ప్రజలు కూడా అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కానీ ఇందులో నేను చేసిందేమీ లేదని..ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా చేయాల్సిన పనినే తాను చేశానని అంటున్నాడు.

సీఎం చంద్రబాబు తెచ్చిన కొత్తపథకాలు ఇవే..

రాష్ట్రం పీకల్లోతు కష్టాల్లో ఉన్నా..ఆర్థిక సంక్షోభంతో బండి నడవడమే కష్టంగా ఉన్నా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రంలోని ఆర్డీవోలు, డీఎస్పీలతో సమావేశమైన సీఎం..రెవెన్యూ సంస్కరణలు, పోలీస్ శాఖలో మార్పులు, వివిధ ప్రాజెక్ట్‌లకు భూసేకరణ, ప్రజలకు సత్వర న్యాయం, సాంకేతికతను అందిపుచ్చుకునే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖకు చెందిన రెండు పథకాలను ఇవాళ ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. 35 ఏళ్లు నిండిన మహిళలకు హెల్త్‌చెకప్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలకు బేబికిట్స్ ఈ పథకాల ద్వారా అందించనున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా పలువురు బాలింతలకు బేబికిట్స్ అందజేశారు.

భారత్‌ను సమర్ధించిన పాక్ చీఫ్ జస్టిస్

భారత్‌తో పాటు వివిధ దేశాల్లో జరుగుతున్న ఉగ్రదాడులకు పాక్‌లో తలదాచుకున్న ఉగ్రవాదులేని మనదేశం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించింది. ఇంతగా వాదిస్తున్నా పాక్ మాత్రం తాము ఉగ్రవాదులకు ఎలాంటి సహయాన్ని అందించడం లేదని బల్లగుద్ది మరి చెప్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అన్వర్ జహీర్ పాక్ వక్రబుద్ధిని బయటపెట్టారు. నిన్న ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు మద్ధతు ఇస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఉగ్రవాదులకు మద్ధతు ఇవ్వడం దురదృష్టకరమని జమాలీ వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న న్యాయమూర్తులను, న్యాయవాదులను భయపెట్టేందుకు ఉగ్రవాదులు కోర్టులను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. దీంతో ఉగ్రవాదం విషయంలో ఇన్నాళ్లు భారత్ చేస్తున్న ఆరోపణలను పాక్ చీఫ్ జస్టిస్ సమర్థించినట్లయింది.

గుద్దేసి కిలోమీటరు దూరం లాక్కెళ్లాడు..

మానవత్వం దాని విలువను ప్రతిరోజు కోల్పోతూనే ఉంది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసింది. జడ్చర్లలో నిమ్మబాయిగడ్డకు చెందిన శ్రీను రోడ్డు దాటుతుండగా ఎరుపు రంగు చవర్లేట్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఒక్కఅమాంతం కారుపై భాగంలో ఎగిరిపడ్డాడు. అంతే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయినా కారును కనీసం ఆపకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా శవంతోనే సుమారు కిలోమీటరు దూరం వెళ్లాడు. ప్రమాదాన్ని గమనించిన కొందరు స్థానికులు బైకులపై వెంబడించారు..దీంతో మాచారం గ్రామానికి కొద్దిదూరంలో బ్రిడ్జి వద్ద కారును వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును స్వాధీనం చేసుకుని..మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఒడిశాలో మానవత్వం మళ్లీ చనిపోయింది..

కట్టుకున్న భార్య మరణిస్తే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేక భుజం పైన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచిన ఓ భర్త దినగాథ ఇంకా జాతి కళ్లలో మెదులుతుండగానే అదే ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. జాజ్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరిలించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బంధువులు తోపుడు రిక్షాలోనే తీసుకెళ్లారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేయలేదని, ప్రైవేట్ వాహానాలవారేమో 12 వేల రూపాయలు అడిగారని, తమ దగ్గర అంతడబ్బులేక..తోపుడు రిక్షాలో తీసుకెళ్లాల్సి వచ్చిందని బంధువులు చెప్పారు.

ఇకపై వికలాంగులకు టోల్‌ట్యాక్స్ ఉండదు

వికలాంగులకు శుభవార్త. ఇకపై దివ్యాంగులు ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ ఉండదు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో వెళ్లేప్పుడు టోల్‌ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. దేశంలోని 63 టోల్‌ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పింది. త్వరలోనే అన్ని ప్లాజాల్లో ఈ సౌకర్యాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. వికలాంగులకు ద్విచక్ర వాహనాలున్నట్లే..మారుతి సహా కొన్ని ఆటోమొబైల్ సంస్థలు దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తున్నాయి. వీటిలో చేతితోనే ఆపరేట్ చేసే క్లచ్ లేదా ఆటోమేటెడ్ క్లచ్, గేర్ తదితర సౌకర్యాలు ఉంటాయి.