సుప్రీంలో కర్ణాటకకు మరోసారి ఎదురుదెబ్బ..
posted on Sep 20, 2016 @ 5:31PM
కావేరి జలాల వివాదం విషయంలో కర్ణాటకకు మరోసారి భంగపాటు తప్పలేదు. కర్ణాటక, తమిళనాడు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన కావేరి నదీ జలాల వివాదం కేసులో ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును వెలువరించిన ధర్మాసనం..కావేరి జలాల్లో తమిళనాడుకు రేపటి నుంచి ఈ నెల 27 వరకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు రోజుకు మూడు వేల క్యూసెక్కుల కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలన్న కావేరి పర్యవేక్షక సమితి ఆదేశాలపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాదనలు వినిపించాయి.
తమ రాష్ట్రం తమిళనాడు కోసం నీటిని త్యాగం చేస్తోందని కర్ణాటక న్యాయవాది వాదించారు. తమిళనాడులో తీవ్ర నీటికొరత ఉందని ఆ రాష్ట్ర న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. అలాగే నాలుగు వారాల్లోగా కావేరి నదీ యజమాన్య బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.