ఒడిశాలో మానవత్వం మళ్లీ చనిపోయింది..

కట్టుకున్న భార్య మరణిస్తే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేక భుజం పైన వేసుకుని 10 కిలోమీటర్లు నడిచిన ఓ భర్త దినగాథ ఇంకా జాతి కళ్లలో మెదులుతుండగానే అదే ఒడిశాలో మరో అమానవీయ ఘటన జరిగింది. జాజ్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించగా, ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరిలించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో బంధువులు తోపుడు రిక్షాలోనే తీసుకెళ్లారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేయలేదని, ప్రైవేట్ వాహానాలవారేమో 12 వేల రూపాయలు అడిగారని, తమ దగ్గర అంతడబ్బులేక..తోపుడు రిక్షాలో తీసుకెళ్లాల్సి వచ్చిందని బంధువులు చెప్పారు.

ఇకపై వికలాంగులకు టోల్‌ట్యాక్స్ ఉండదు

వికలాంగులకు శుభవార్త. ఇకపై దివ్యాంగులు ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ ఉండదు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో వెళ్లేప్పుడు టోల్‌ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. దేశంలోని 63 టోల్‌ప్లాజాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పింది. త్వరలోనే అన్ని ప్లాజాల్లో ఈ సౌకర్యాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. వికలాంగులకు ద్విచక్ర వాహనాలున్నట్లే..మారుతి సహా కొన్ని ఆటోమొబైల్ సంస్థలు దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు రూపొందిస్తున్నాయి. వీటిలో చేతితోనే ఆపరేట్ చేసే క్లచ్ లేదా ఆటోమేటెడ్ క్లచ్, గేర్ తదితర సౌకర్యాలు ఉంటాయి.

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రత్యూష లవర్..

ఆత్మహత్యకు పాల్పడిన బాలికా వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ డ్రంకన్ డ్రవ్‌లో పట్టుబడ్డాడు. అతని మాజీ ప్రేయసి సలోని శర్మతో కలిసి ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతం వైపు వెళ్తుండగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ జంట కనిపించింది. ఈ క్రమంలో వీరిని తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా సలోని శర్మ పోలీసులను అడ్డుకుంది. తనిఖీలు చేస్తే ఉన్నతాధికారులకు చెబుతామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె వార్నింగ్ ఇచ్చింది. అయినా పోలీసులు పట్టువదలకుండా రాహుల్‌ను తనిఖీలు చేశారు. దీనిలో అతను మద్యం తాగి కారు డ్రైవ్ చేసినట్లు తేలడంతో అతన్ని అరెస్ట్ చేశారు.

ప్రేమించడం లేదని గొంతు కోశాడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతజిల్లా మెదక్‌లో దారుణం జరిగింది. తన ప్రేమను ఒప్పుకోవడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. సదాశివపేటలోని పద్మనాభ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్ధినిని అదే ప్రాంతానికి చెందిన సతీష్ గత కొంతకాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. అతని ప్రేమను ఆ యువతి నిరాకరించడంతో సతీష్ ఆమెపై కక్ష కట్టాడు. ఇవాళ కాలేజీకి వెళ్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు సతీష్‌ని పట్టుకునే లోపే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సతీష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలోని ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3న నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 4న నామినేషన్ల పరిశీలన జరుపనున్నారు. 6న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. వచ్చే నెల 17న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికకావడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తెంది. ఈ స్థానానికి టీఆర్ఎస్ మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ను తన అభ్యర్థిగా గతంలోనే ప్రకటించింది.

బీహార్‌లో ఘోర ప్రమాదం..50 మంది మృతి

బీహార్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. మధుబని జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో 50 మంది దుర్మరణం పాలయ్యారు. సీతామర్హి నుంచి మధుబనికి 55 మందితో వెళ్తున్న బస్సు ఒక చెరువు మీదుగా వెళ్తుండగా డ్రైవర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు 25 అడుగుల లోతున్న చెరువులోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్ధం వినిపించడంతో గ్రామస్తులు పరుగు పరుగున చెరువు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి నాలుగు మృతదేహలు పైకి తేలాయి. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించారు.

ఇకపై ఆన్‌లైన్‌లో "లింగనిర్థారణ" కుదరదు..

మాతృత్వం మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. గర్భం దాల్చేమని తెలియగానే దంపతులు ఉప్పొంగిపోతారు. ఆ ఆనందంలోనే పుట్టేది మగ బిడ్డా..ఆడబిడ్డా అని తెలుసుకోవాలనుకుంటారు. అయితే మన చట్టాల ప్రకారం ఆసుపత్రుల్లో లింగ నిర్థారణ పరీక్షలు నిషిద్ధం. అయితే టెక్నాలజీ పుణ్యమా అని ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. దాని సాయంతో పుట్టేది ఎవరో తెలుసుకుంటున్నారు. అయితే దీని వల్ల భ్రూణ హత్యలు పెరిగిపోవటంతో సాబుమాథ్యూ జార్జ్ అనే వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇంటర్నెట్‌ సెర్చింజిన్‌లో ఇలాంటి సమాచారం ఆగిపోయే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆర్డర్‌తో నిద్రలేచిన కేంద్రం ఆయా సెర్చ్ ఇంజిన్ కంపెనీలతో చర్చలు జరిపింది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకున్న సెర్చ్ ఇంజిన్లు ఇందుకోసం ఒక ప్రత్యేక ఆటో బ్లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి. లింగనిర్థారణ సమాచారం నిమిత్తం వెతికే 22కీ వర్డ్స్‌ను గుర్తించామని..ఆ పదాలతో వెతికితే యూజర్లకు ఎటువంటి సమాచారం లభ్యం కాదని సెర్చ్‌ ఇంజిన్లు భారత ప్రభుత్వానికి తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదించింది.

యూరీ అమరవీరులకు ఎక్స్‌గ్రేషియా..

జమ్మూకశ్మీర్‌లోని యూరీ సెక్టార్ వద్ద ఉన్న భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నిన్న 17 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా...చికిత్స పొందుతూ ఇవాళ మరో ముగ్గురు జవాన్లు తుదిశ్వాస విడిచారు. వీరి త్యాగాన్ని జాతి యావత్తూ కొనియాడుతున్నా..మరణించిన సైనికుల కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం అలుముకుంది. అయితే అమరులైన జవాన్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. ఉగ్రవాద దాడిలో హతమైన జార్ఖండ్‌కు చెందిన జవానుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘవర్ సింగ్ రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే ఈ దాడిలో అమరులైన ఉత్తరప్రదేశ్‌ జవాన్లకు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ రూ.20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అలాగే బీహార్ సైనికులుకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం నితీష్ కుమార్.

అందుకే ప్యాకేజీకి అంగీకరించా:చంద్రబాబు

రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని..ఆస్తుల విభజనలో హేతుబద్ధత పాటించలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో బెల్ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పోరాడారని..అయితే ఆ హామీని చట్టంలో పొందుపరచకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు. హోదా ఇవ్వడం కుదరనందువల్ల, దానికి సమానమైన ప్రయోజనాలతో ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్యాకేజీని అంగీకరించినట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి అనేక సంస్థలు వస్తున్నాయని..వాటికి కావాల్సిన భూములను రాష్ట్రప్రభుత్వం ఇస్తోందన్నారు.

అమెరికాలో మరోసారి బాంబు కలకలం..

న్యూయార్క్ మన్‌హట్టన్ వద్ద గత శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించి 29 మంది తీవ్రంగా గాయపడిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరవకముందే మరోసారి బాంబు కలకలం రేగింది. న్యూజెర్సీలోని ఎలిజబెత్ రైల్వేస్టేషన్‌ పట్టాలపై మరో బాంబును అధికారులు గుర్తించారు. ఓ ఫోనుకు వైరు కట్టి దానికి బాంబు అమర్చి ఉండటం గమనించిన కొందరు ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో ఆ బాంబును నిర్వీర్యం చేశారు. అనంతరం స్టేషన్‌ను ఖాళీ చేయించి అనువణువూను జల్లెడ పట్టారు. దీంతో అమెరికా వ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

అతనోక విషపురుగు-సానియా

భారత టెన్నిస్‌లో వివాదం ముదురుతోంది. గత రెండు ఒలింపిక్స్‌లకు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. దీనిపై భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి తీవ్రంగా స్పందించారు. అతనోక విషపురుగు అంటూ పేసును ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని ట్వీట్ చేశారు. గత రెండు ఒలింపిక్స్‌ టెన్నిస్ డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించారు. లండన్, రియో ఒలింపిక్స్‌లకు మనదేశం తరపున మేటి జంటను పంపలేకపోయామని..అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నామన్నారు. అంతేకాకుండా సానియా, రోహన్ బొపన్నను ఎంపిక చేయడాన్ని పేస్ తప్పుపట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా పై విధంగా స్పందించారు. అయితే వీరిద్దరి వివాదం భారత టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదం ఇంకేంత దూరం వెళుతుందో వేచి చూడాలి.

కాపులను బీసీల్లో చేర్చడంపై ప్రజాభిప్రాయ సేకరణ..

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఏపీలో మళ్లీ వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్‌పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంజునాథ కమిషన్ నియమించింది. ఈ విషయమై ఇవాళ్టీ నుంచి మంజునాథ కమిషన్‌ ప్రజల నుంచి వచ్చే వినతులపై ప్రజాభిప్రాయ సేకరణ జరపనుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది. తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన అనంతరం ఈ నెల 26వ తేదీ నుంచి కడపలో కమిషన్ పర్యటించనుంది. దసరా అనంతరం అక్టోబర్ 17 నుంచి అనంతపురం, 24వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో మంజునాథ కమిషన్ పర్యటించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు పరిశీలించనుంది.

స్వాతిని చంపిన నిందితుడు జైల్లో ఆత్మహత్య

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని పొట్టనబెట్టుకున్న ప్రేమోన్మాది రామ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్వాతి హత్య అనంతరం పోలీసులు రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చెన్నైలోని పుజల్ జైలుకు పంపారు. నిన్న మధ్యాహ్నం సమయంలో ఖైదీలంతా భోజనం చేస్తున్న వేళ జైలు ప్రాంగణంలోని కరెంట్ తీగను నోటితో పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అధికారులు వెంటనే రాయపేట ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు రామ్‌కుమార్ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. చెన్నై ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న స్వాతిని ఈ ఏడాది జూన్ 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు రామ్‌కుమార్. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలోనే రామ్‌కుమార్ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

వదిలిపెట్టేది లేదు ..ప్రతీకారం తీర్చుకుంటాం

యూరీలోని భారత సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల ప్రాణ త్యాగాన్ని వృథా కానివ్వబోమని, పాక్‌కు తగిన బుద్ధి చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు, వెనకుండి ప్రోత్సహించిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు. ఉగ్రదాడి అనంతరం పరిస్థితిని సమీక్షించామని, దాడి కారకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తెలిపారు. ఎదురుగా వచ్చి భారత్‌ను ఎదుర్కోలేకనే ముష్కరులు ఇలా వెనుక నుంచి దెబ్బ కొడుతున్నారని ఆయన ఆరోపించారు.

యూరీ ఘటనపై రాజ్‌నాథ్ అత్యున్నత సమీక్ష..

జమ్మూకశ్మీర్ యూరిలోని భారతసైన్యం క్యాంప్‌పై ముష్కరులు దాడికి తెగబడి 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జాతీయ భద్రత, సరిహద్దుల్లో చోరబాటు తదితర అంశాలపై ఇవాళ అత్యున్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రక్షణ విభాగాల ప్రతినిధులు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో,రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధ్యక్షులు, హోం, రక్షణ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటుగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ డీజీలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.

కశ్మీర్ ఉగ్రవాదులకు అన్నల మద్ధతు..

ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన మధ్య పోరాటాన్ని కొనసాగిస్తోన్న కశ్మీర్ వేర్పాటువాదులకు ఊహించని మద్ధతు లభించింది. ఆ మద్ధతు ఎవరిదో కాదు దేశ అంతర్గత  భద్రతకు పెను సవాలుగా మారిన మావోయిస్టుల నుంచి వచ్చింది. కశ్మీర్ వేర్పాటు వాదులకు తాము పూర్తి మద్ధతు ఇస్తున్నట్టు ఆంధ్రా-ఒడిశా మావోయిస్టు కమిటీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసింది. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఆ లేఖలో డిమాండ్ చేసింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. 70 వేల మంది యువకులను ప్రభుత్వం కిరాయి మూకలతో చంపించిందని..ఇంకా లెక్కలేనన్ని అత్యాచారాలు, ఘోరాలు జరుగుతున్నాయంటూ లేఖలో పేర్కొంది. ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రజల దృష్టి మరల్చేందుకు కశ్మీర్ సమస్యను తెరపైకి తీసుకొచ్చిందంటూ తీవ్రస్థాయిలో విమర్శించింది.