చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్.. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఘర్షణ

చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో నిధుల దుర్వినియోగంపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్ ను నిలదీశారు. దీనికి టీడీపీ కార్పొరేటర్లు కల్పించుకుని సమాధానాలు చెప్పడం ప్రారంభించడంతో.. దీనిపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రం కావడంతో రెండు పార్టీల కార్పొరేటర్లు తోపులాటకు దిగారు. దీంతో మేయర్ ఇరు వర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో సమావేశం రసాభాసగా మారింది.

వరంగల్ బహిరంగ సభలో అమిత్ షా..

  ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండలో ఈరోజు బీజేపీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషా కూడా హాజరుకానున్నారు. దీనిలోభాగంగానే ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శంషాబాద్‌లో నిర్వ‌హించిన‌ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొని వరంగ‌ల్‌కి బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మోదీ జ‌న్మ‌దినాన్ని పార్టీ శ్రేణులు సేవా దినోత్స‌వంగా జ‌రుపుతున్నార‌ని.. మోదీ మేనియా రోజురోజుకీ పెరుగుతూనే ఉంద‌ని అన్నారు. కాగా వరంగల్ సభలో పాల్గొన్న అనంతరం అమిత్ షా వ‌రంగ‌ల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొని రేపు ఉదయం ఆయ‌న మ‌ళ్లీ ఢిల్లీకి బయల్దేరనున్నారు.

మళ్లీ భూమనకి నోటీసులు.. వైసీపీ ఆగ్రహం..

  కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమంలో జరిగిన అల్లర్ల సంగతి తెలిసిందే. తునిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇప్పటికీ పలువురికి నోటీసులు అందుతున్నాయి. ఈ కేసులో భాగంగా వేసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు అందాయి. దీనిలో భాగంగా ఆయన విచారణలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డికి ఈరోజు సీఐడీ మ‌రోసారి ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి ఆయ‌న రావాల‌ని సూచించింది. భూమ‌నకు మళ్లీ సీఐడీ నోటీసులు రావ‌డం ప‌ట్ల వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వరంగల్ రిజర్వాయర్లో పడి 5గురు గల్లంతు.. ఒకరు మృతి

  వరంగల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. వరంగల్ రిజర్వాయర్ ను సందర్శించడానికి వెళ్లిన కొంతమంది విద్యార్ధులు గల్లంతయ్యారు. వివరాల ప్రకారం.. వరంగల్‌లోని వాగ్దేవి ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్ధులు ఈరోజు ఉదయం ధర్మసాగర్‌ జలాశయాన్ని సందర్శించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఓ విద్యార్ధి రిజర్వాయర్‌లోకి జారి పోతుండగా అతన్ని కాపాడటానికి మరికొందరు విద్యార్థులు ప్రయత్నించగా మరికొంత మంది రిజర్యాయర్లో పడి గల్లంతయ్యారు. రిజర్యాయర్ ను సందర్శించిన వారిలో శ్రావ్యారెడ్డి, శివసాయి, శివసాయికృష్ణ, వినూత్న, సాగర్‌, రమ్య ప్రత్యూషలు ఉండగా వారిలో రమ్య ప్రత్యూషను మాత్రం కాపాడగలిగారు. ఇంకా శ్రావ్యరెడ్డి మృతదేహాన్ని ఈతగాళ్లు వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

మరోసారి చంద్రబాబు ఆగ్రహానికి గురైన అధికారులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ అధికారులపై మండిపడటం కామన్. ఈసారి ఆయన ఆగ్రహానికి మరోసారి బుక్కయ్యారు ప్రభుత్వ అధికారులు. అమ‌రావ‌తి నుంచి ఆయ‌న టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ది శాఖల అధికారులు, జిల్లాల యంత్రాంగం, గ్రామ సర్పంచులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వాపిస్తోన్న అంటువాధ్యులపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జారోగ్యం క్షీణిస్తోంటే సంబంధిత‌ అధికారులు క‌ట్టుక‌థ‌లు చెప్పి త‌ప్పించుకోవ‌ద్ద‌ని అన్నారు. ప్ర‌జ‌లు డెంగ్యూతో బాధ‌ప‌డుతోంటే అధికారుల్లో బాధ ఉండ‌దా? అని ప్ర‌శ్నించారు. అధికారి హోదాలో ఉన్న‌వారు త‌మ ఇంట్లో వ్య‌క్తుల‌న‌యినా, ఊరిలో వారినైనా ఒక్కటిగానే చూడాల‌ని చంద్రబాబు అన్నారు. అటువంట‌ప్పుడే ప్ర‌జ‌లు అధికారులు, సిబ్బంది నుంచి మంచి సేవలు అందుకుంటార‌ని హిత‌వు ప‌లికారు. ఇక పై ప్రతి శనివారం ఆరోగ్య దినంగా పాటించాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

సెప్టెంబర్ 17.. ఒక్కో పార్టీ ఒక్కోలా

  సెప్టెంబర్ 17 ఈరోజు తెలంగాణ విమోచ దినమా..లేక విలీనమా అన్న సందేహం ఇప్పటి నుండి కాదు ఎప్పటినుండో అందరిలో మెదిలే సమస్యనే. అయితే ఈ రోజును పలు రాజకీయ పార్టీలు తమకు నచ్చిన విధంగా జరుపుకుంటున్నాయి. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఈరోజును తెలంగాణ విలీన దినోత్స‌వంగా జ‌రుపుకున్నారు. సెప్టెంబ‌ర్ 17 రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్యంలోకి వచ్చిన రోజని.. హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు. ఈ సంద‌ర్భంగా తాము అధికారంలోకి వ‌స్తే విమోచ‌న దినోత్స‌వం జ‌రిపిస్తామ‌ని ఏనాడూ చెప్ప‌లేద‌ని నాయిని అన్నారు.   ఇక భార‌తీయ జ‌న‌తాపార్టీ (బీజేపీ), టీడీపీ నేతలు ఈరోజును తెలంగాణ‌ విమోచ‌న దినోత్స‌వం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ‌ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లోనూ తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం జ‌రుపుతున్నారు. టీటీడీపీ నేత ఎల్‌.ర‌మ‌ణ జాతీయ ప‌తాకం ఆవిష్క‌రించారు.

మోడీ పుట్టినరోజు.. తల్లి అశీర్వాదం..

  ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 66 వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోడీ మాత్రం ఉదయాన్నే తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని తన తల్లి  హీరాబెన్‌ను కలిసి ఆమె పాదాలకు నమస్కారం చేసి ఆశ్వీరాదం తీసుకున్నారు. ఇంకా ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరింత సేవ చేయాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.   మరోవైపు శుభాకాంక్షలు తెలపడానికి నరేంద్రమోదీ యాప్ లో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విభాగం కేటాయించారు. ఈ విభాగం ద్వారా దేశ పౌరులు ఎవరైనా సరే తమ స్మార్ట్ ఫోన్ నుంచి ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు.  

పైలట్ ను షాక్ ఇచ్చిన రాహుల్ గార్డులు..

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే కాదు.. ఆయన గార్డులు కూడా అందరిని షాక్ కు గురి చేస్తున్నారు. ఇంతకీ ఆయన గార్డులు ఎవరిని షాక్ కు గురిచేశారబ్బా అనుకుంటున్నారా.. ఎవరంటే ఓ విమాన పైలట్ ను షాక్ కు గురిచేశారు. అసలు సంగతేంటంటే..రాహుల్ గాంధీ  ఈ నెల 14న ఇండిగో విమానంలో ఉదయం 8.55 గంటలకు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన భద్రతా సిబ్బంది.. సదరు విమాన పైలట్ ను లైసెస్స్ చూపించమన్నారు. దీంతో పైలట్ షాకయ్యాడు. ఎందుకంటే పైలట్ల లైసెన్స్ ను చూపించాలని అడిగే హక్కు సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు మినహా మరెవరికీ లేదు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. విమానంలోని ఇంధనం నాణ్యతను కూడా పరీక్షించి చూపాలని డిమాండ్ చేశారు. దీంతో పౌర విమానయాన శాఖాధికారులు కలుగజేసుకోవడంతో సమస్య పరిష్కారమైంది.

వెంకయ్యకు సన్మాన సభ.. అందుకే ఈ సభ

  విజయవాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి సన్మాన సభ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకు గాను వెంకయ్యనాయుడికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి విజయవాడకు ర్యాలీగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకు.. ప్యాకేజీపై విమర్శలు తిప్పికొట్టేందుకు విజయవాడకు వచ్చా.. నేతల కంటే జనం తెలివైనవారు అని మరోసారి రుజువైంది.. ప్యాకేజీ పట్ల ప్రజలు సానుకూలంగానే ఉన్నారు అని అన్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాలకు మాత్రమే ప్యాకేజీ ఇస్తారు.. 1972లో ఏపీ విడిపోయి ఉంటే ఇప్పుడు ముఖ చిత్రమే వేరుగా ఉండేది.. రాజధానిని అభివృద్ది చేసుకుందామని హైదరాబాద్ ను అభివృద్ధి చేశారు..విభజన గతం.. అభివృద్ధి మా అభిమతం.. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చాలని కోరా అని అన్నారు. 2004 ఎన్నికల ప్రమాణాల్లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.. విడిపోయి అభివృద్ధి చెందుతారనే.. విభజనకు బీజేపీ మద్దతు తెలిపింది.. అప్పుడు రాష్ట్ర విభజనకు అన్నిపార్టీలు అంగీకారం తెలిపాయి అని వ్యాఖ్యానించారు.

దళిత ఉద్యమ నేత బొజ్జా తారకం కన్నుమూత..

  ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత బొజ్జా తారకం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు  హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో మృతిచెందారు. 1939 జూన్ 27  తూర్పు గోదావరి జిల్లా, కందికుప్పలో జన్మించిన బొజ్జా తారకం దళిత, పౌరహక్కుల కోసం.. దళితులపై వ్యతిరేకంగా జరిగే దాడులకు ఆయన పోరాటం చేశారు. కాగా ప్రజల సందర్శనార్ధం మధ్యాహ్నం మూడుగంటల వరకూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బొజ్జా భౌతికకాయం ఉంచగా.. సాయంత్రం ఆరు గంటలకు ఫిల్మ్ నగర్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.    కాగా ప్రముఖ కవి బోయి భీమన్నకు బొజ్జా తారకం అల్లుడు. ఆయనకు భార్య విజయశాంతి, కుమారుడు రాహుల్ బొజ్జా, కుమార్తె మహిత ఉన్నారు. రాహుల్ బొజ్జా ప్రస్తుతం హైదరాబాదు కలెక్టర్ గా పనిచేస్తున్నారు.

హెచ్సీయూలో దారుణం.. మరో విద్యార్ధి ఆత్మహత్య..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతంలో దళిత విద్యార్ధి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఫేమస్ అయిన వర్శిటీలో మళ్లీ  అలాంటి ఘటనే పునరావృతం అయింది. ప్రవీణ్ అనే విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. వర్శిటీలో ఎంఎఫ్ఏ ఫస్టియర్ చదువుతున్న ప్రవీణ్ హాస్టల్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ నెల రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు. రెండు రోజులకే ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. అయితే ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏముందో తెలియాల్సి ఉంది. ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ముందుగానే హెచ్సీయూ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 

రగిలిపోతున్న బిజ్నూర్.. అమ్మాయిలపై వేధింపులు.. ముగ్గురు హత్య

  ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్లో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది. చిలికి చిలికి వాన అయిన సామెత ప్రకారం.. చిన్నపాటి గొడవ కాస్త ముగ్గురు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. వివరాల ప్రకారం.. యూపీలోని బిజ్నూర్ పట్టణంలో  స్కూలుకు వెళుతున్న కొంతమంది అమ్మాయిలను.. ఓ వర్గానికి చెందిన యువకులు వేధించారు. దీంతో విద్యార్ధినిలు నేరుగా ఇళ్లకు వెళ్లి విషయం చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు యువకులను నిలదీసేందుకు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువర్గాలు తీవ్రంగా వాదులాడుకున్నాయి. దీంతో యువకుని తరుపున ఓవ్యక్తి తుపాకీ తీసి అమ్మాయిల తరుపున వారిపై కాల్పులు జరపడంతో అక్కడిక్కడే ఓవ్యక్తి చనిపోగా... మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి  ఇరుపక్షాలను చెదగొట్టారు. ఈ సందర్భంగా డీజీ దల్టీత్ చౌదరి మాట్లాడుతూ.. చనిపోయిన యువకులను అహసాన్, సర్తాజ్, అనీస్ లుగా గుర్తించామని, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులను మృతదేహాలను అందజేస్తామని.. బిజ్నూర్ కల్లోలంపై ప్రత్యేక దృష్టిసారించరమని తెలిపారు.

షాబుద్దీన్ బెయిల్ పై సుప్రీంను ఆశ్రయించిన బీహార్ సర్కార్..

  బీహార్ నేరచరితుడు, రాష్ట్రీయ జనతా దళ్ నేత అయిన మహమ్మద్ షాబుద్దీన్ దాదాపు 12 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన తరువాత ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మహమ్మద్ షాబుద్దీన్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన అంశం వివాదాస్పదంగా మారింది. తాను బయటకి వచ్చింన తరువాత ‘లాలూ మాత్రమే తమ నాయకుడంటూ’ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ స్పందించింది. షాబుద్దీన్ విషయంలో ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో షాబుద్దీన్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ నితీశ్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.

నిమిషానికో ట్విస్ట్.. సమాజ్ వాద్ పార్టీ దారెటు..

  సమాజ్ వాదీ పార్టీలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నెలకొంటున్నాయి. గత రెండురోజుల క్రితం నుండి ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు బయటపడుతున్న నేపథ్యంలో వేడి వాతావరణం నెలకొంది. ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ ను సంతృప్తి చేసేందుకు గాను కొడుకు అని కూడా చూడకుండా అఖిలేశ్ ను అధ్యక్ష పదవి నుండి తొలగించారు. ఆ పదవిని కాస్త శివపాల్ యాదవ్ కు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయనకు ఏమైందో ఏమో కాని.. అధ్యక్ష పదవికి.. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఆయన ఒక్కడే కాదు ఆయన భార్య, కుమారుడు అందరూ రాజీనామాలు చేశారు. అయితే అఖిలేశ్ మాత్రం తన బాబాయి రాజీనామాను తిరస్కరించినట్టు తెలుస్తోంది. తన తండ్రి ములాయం సింగ్ తో చర్చలు జరిపిన తరువాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు తన కుటుంబంలో నెలకొన్న రాజకీయ విబేధాల నేపథ్యంలో ములాయం మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ మొత్తం ఒక కుటుంబం లాంటిదని, తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. అయితే ఆయన అలా చెప్పిన కొద్దిసేపటికే శివపాల్ యాదవ్ తన రాజీనామాను ఆమోదించాల్సిందే అని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మరి పైకి అంతా సమసిపోయినట్లే కనిపిస్తున్నా.. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి నిమిషానికో రకంగా మారుతున్న ఈ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.