అశ్లీల నృత్యాలుంటేనే ప్రజలు మెలకువగా ఉంటారు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
posted on Sep 21, 2016 @ 12:05PM
సంచలన వ్యాఖ్యలు చేయడంలో రాజకీయ నేతలు తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆవేశంలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానిస్తారు.. తరువాత చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఫగన్ కులస్తే కూడా సంచలన వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ నయిన్ పూర్ జిల్లాలో పిప్రియో గ్రామంలో గోండు రాజులు శంకర్ షా, రఘునాథ్ షా సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కులస్తే ను అతిధిగా పిలవగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఛత్తీస్ గఢ్ నుంచి డ్యాన్సర్లను రప్పించి మరీ అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. వీటిని ఆసక్తిగా తిలకించిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిలో ఇలాంటి డాన్సులు భాగమని, ప్రజలు కూడా వీటిని బాగా ఇష్టపడుతున్నారని.. రాత్రుళ్లు ప్రజలు మెలకువగా ఉండాలంటే ఇలాంటి డ్యాన్స్ ప్రదర్శనలు అవసరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.