న్యూయార్క్ పేలుళ్ల ఉగ్రవాదిని పట్టించిన భారతీయుడు
posted on Sep 20, 2016 @ 12:24PM
అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీల్లో జరిగిన బాంబు దాడులు అగ్రరాజ్యాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఈ ఘటనతో ప్రజలు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలకు గురయ్యారు. అటు ఈ దాడులకు కారణమైన 28 ఏళ్ల అఫ్గన్ సంతతి అమెరికన్ పౌరుడైన అహ్మద్ ఖాన్ రహామీ కోసం పోలీసులు, ఎఫ్‌బీఐ, ఇలా అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇంతలా శ్రమిస్తున్నా..దేశం మొత్తం హైఅలర్ట్ ప్రకటించినా ఫలితం శూన్యం. అంతమంది శోధించినా దొరకని వ్యక్తిని ఒక భారతీయుడు గుర్తించాడు.
హరిందర్ బెయిన్స్ అనే భారతీయుడు. లిండన్‌లోని ఓ బార్‌కు యజమాని అయిన హరిందర్ బార్‌లో వార్తలు చూస్తున్నాడు. అప్పటికే పోలీసులు అనుమానితుడి ఫోటోను విడుదల చేయడంతో హరిందర్ చూపు తన ముందు నుంచి వెళుతున్న వ్యక్తిపై పడింది. కాస్త అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులను చూడగానే ఆ ఉగ్రవాది కాల్పులకు దిగాడు. వారు కూడా ఎదురు కాల్పులకు దిగి ఎట్టకేలకు ఉగ్రవాదిని బంధించగలిగారు. ఈ ఘటనతో హరిందర్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అక్కడి పోలీసులతో పాటు సాధారణ ప్రజలు కూడా అతడిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కానీ ఇందులో నేను చేసిందేమీ లేదని..ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా చేయాల్సిన పనినే తాను చేశానని అంటున్నాడు.