బాబా కోలుకుంటున్నారు
posted on Apr 8, 2011 9:28AM
పుట్టపర్తి: సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం ఉదయం తాజా బులెటిన్ విడుదల అయ్యింది. బాబా క్రమంగా కోలుకుంటున్నారని వైద్యుడు సఫాయా తెలిపారు. కిడ్నిల పనితీరు మెరుగుపడిందని, డయాలసిస్ జరుగుతుందన్నారు. ఆయనకు నిరంతరం సీఆర్ఆర్ థెరపీ ద్వారా చికిత్స చేస్తుండడంతో ఇది సాధ్యమైందని తెలిపారు.వెంటిలేటర్ల ద్వారా శ్వాసను అందిస్తున్నట్లు వెల్లడించారు. రక్త ప్రసరణ, షుగర్ లెవెల్ సాధారణంగా ఉన్నట్లు సఫాయా పేర్కొన్నారు. ముఖ్యమైన అవయవాల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. బాబాకు డయాలసిస్ చేసే సమయాన్ని క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బాబా స్పృహలో మార్పు కనిపిస్తుందని చెప్పారు. ఐసీయూలో సత్యసాయికి చికిత్సలు చేస్తుండడంతో సందర్శకులను లోనికి అనుమతించలేదని బులెటిన్‌లో తెలిపారు. కాగా.. కొన్ని రోజులుగా ప్రశాంతి నిలయం బస్ స్టాండ్ నుంచి బస్సుల రాకపోకలను అనుమతించడం లేదు. గురువారం వాటిని పునరుద్ధరించారు. బాబా ఆరోగ్యం మెరుగైందన్న వార్తలు రావడంతో పుట్టపర్తిలో వ్యాపారులు మూసిన దుకాణాలను తెరిచారు.