రాజీపడితే ఎన్నికలు వచ్చేవి కావు: జగన్
posted on Apr 8, 2011 @ 4:17PM
కడప : తమ నాన్న నేర్పిన నైతిక విలువలను వదిలేసి ఉంటే ఈరోజు ఉప ఎన్నికలు వచ్చేవి కావేమోనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెసు పార్టీతో రాజీ పడితే తనకు పెద్ద పదవులు వచ్చేవన్నారు. కానీ తాను రాజీపడకుండా ప్రజల పక్షాన నిలవడానికే నిర్ణయించుకున్నానని చెప్పారు. సచ్చీలత, విశ్వసనీయతను తాను పక్కనపెట్టి రాజీ పడుంటే తనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి సోనియా పక్కన కూర్చోబెట్టుకుని ఉండేవారన్నారు. వైఎస్‌ఆర్ పెంపకంలో రాజీపడటం తాను నేర్చుకోలేదని జగన్ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, సోనియాగాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఒకప్పుడు ఇండియన్ కాంగ్రెస్‌లో ఇందిరా కాంగ్రెస్‌గా మారి, సోనియా వచ్చాక ఇటాలియన్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. విలువలను వదిలేసుకుంటే తాను సోనియాకు బానిసలా బతకాల్సి వచ్చేందని జగన్ అన్నారు.