వైఎస్ కు తెలియకుండా జగన్ సెటిల్‌మెంట్లు
posted on Apr 8, 2011 @ 11:54AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వరదరాజులు రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ ప్రజా సేవకుడు కాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి తెలియకుండా భారిగా జగన్ సెటిల్‌మెంట్లు చేశారని అన్నారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యాపారం అని దుయ్యబట్టారు. జగన్‌కు ఆయన మేనమామ పోలికలు వచ్చాయన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని జగన్ వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలను ఎంత వరకైనా ఖర్చు పెట్టి గెలవాలని ఆయన ఆశిస్తున్నారని అన్నారు. అవినీతిపరుడు అయిన జగన్‌ను ప్రజలు గెలిపించరన్నారు. తన మద్దతు మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికే ఉంటుందన్నారు. కడప, పులివెందులలో తప్పకుండా కాంగ్రెసు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీ జగన్ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి తమకు కాదని, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసుకు మధ్యే ఉంటుందని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.