హజారే దీక్షకు దిగివచ్చిన కేంద్రం
posted on Apr 8, 2011 9:27AM
న్యూఢిల్లీ: అన్నాహజారే ‘ఆమరణ’ యుద్ధం ఫలించింది. సంఘ సంస్కర్త నిరశన దీక్షకు కేంద్రం కంపించింది. ఢిల్లీలో మొదలైన ఉద్యమానికి గల్లీల నుంచీ మద్దతు పెల్లుబుకడంతో, తప్పని పరిస్థితుల్లో కేంద్రం దిగివచ్చింది. అవినీతి నిగ్గు తేల్చేందుకు మేమూ సిద్ధమేనంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఏ సర్కారు ‘లోక్‌పాల్’ను ‘జనలోక్‌పాల్’ చేద్దామంటూ అంగీకరించింది. జనలోక్‌పాల్ బిల్లుకు రూపకల్పన చేస్తామంటూ కేంద్రం అంగీకరించింది. అందుకు ప్రభుత్వ, ప్రజల ప్రతినిధులతో కూడిన ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అంగీకరించారు. జనలోక్‌పాల్ బిల్లు రూపకల్పన చేసే కమిటీలో ప్రభుత్వపక్షం నుంచి ఐదుగురు, ప్రజల పక్షం నుంచి ఐదుగురు సభ్యులు ఉంటారు. జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించేందుకు సైతం సంకీర్ణ సర్కారు పచ్చజెండా ఊపింది. అయితే కమిటీకి ఎవరు నాయకత్వం వహించాలి? కమిటీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలా? వద్దా? అన్న అంశాలపై ఇరుపక్షాల మధ్య తుది అంగీకారం కుదరాల్సి ఉంది. అన్నా హజారేకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మద్దతిచ్చారు. హజారే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకున్నారని, లోక్‌పాల్ బిల్లు సమస్యను పరిష్కరించాలని ఆమె పేర్కొన్నారు. హజారే దీక్షపై సోనియా గాంధీ సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా లోక్‌పాల్ బిల్లుతో పాటు అవినీతి నిర్మూలను బలమైన చట్టాలుండాలి. అప్పుడే సత్ఫలితాలు అందుతాయని సోనియా చెప్పారు. తమ డిమాండ్లు అన్నింటినీ అంగీకరించే వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని అన్నాహజారే ప్రకటించారు. మన్మోహన్‌సింగ్ తరఫున కేంద్ర టెలికమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ కూడా అన్నాహజారే ప్రతినిధులు స్వామి అగ్నివేష్, అరవింద్ కజ్రేవాల్‌తో కమిటీ ఏర్పాటుపై సంప్రదింపులు జరిపారు. ఇరుపక్షాలు రెండు దఫాల చర్చలు జరిపిన అనంతరం, జనలోక్‌పాల్ బిల్లు తయారు చేసేందుకు సంయుక్త కమిటీ ఏర్పాటు చేయటంతోపాటు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిని ప్రతిపాదించే విధంగా ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. కాగా, మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్న హజారేను వైద్యులు పరిశీలించారు. ఆయన బీపీ నార్మల్‌గా ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డీ హైడ్రేషన్‌లో హజారే ఉన్నారని వైద్యులు చెప్పారు.