ఇక చిత్రసీమను తాకిన సమ్మె సైరన్
posted on Apr 8, 2011 @ 9:55AM
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమ మళ్లీ సమ్మెబాట పట్టనుంది. సినీ రంగంలోని 24 శాఖలకు చెందిన కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తామని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మెకు ఫెడరేషన్ పిలుపునిచ్చింది. గురువారం జరిగిన సమావేశంలో ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అనంతరం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ‘కార్మికుల జీత భత్యాలు, ఇంక్రిమెంట్లతో పాటు కొన్ని డిమాండ్లను గతంలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుంచాం. ఈ నెల 8 లోపు పరిష్కరించాలని గడువు విధించాం. అయినా దీనిపై వారు స్పందించలేదు. అందుకే సమ్మెకు ఉపక్రమించాం’ అన్నారు. కాగా సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న చాంబర్ సభ్యుల నిర్ణయాన్ని ఫెడరేషన్ తిరస్కరించింది. మన చాంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారమే అమలు జరగాలని పట్టుపట్టింది. సమ్మెలో 14 వేల మంది కార్మికులు పాల్గొంటారని ఫెడరేషన్ తెలిపింది. సోమవారంలోపు చలనచిత్ర వాణిజ్యమండలి స్పందించకుంటే సమ్మెను తీవ్రతరం చేస్తామని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.