కాంగ్రెస్ లో ఆ కొరత లేదు
posted on Apr 7, 2011 @ 3:10PM
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ అయినందున అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం కావడం మామూలే అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు ఎన్.తులసీరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఆలస్యం అవుతుందన్నారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించామని, అధిష్టానం ఆమోదం తెలిపిన తర్వాత పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప నుండి పోటీ చేయడానికే రాజీనామా చేశారు కాబట్టి ఆయన ముందుగా ప్రచారానికి వెళ్లారని ఆయన చెప్పారు. ఆయన అభ్యర్థిత్వం ఎవరో ఆమోదించాల్సింది కాదన్నారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై తులసీరెడ్డి ఫైర్ అయ్యారు. ఆ పత్రికలో కాంగ్రెసు పార్టీకి అభ్యర్థుల కొరత ఉందని, కడపలో పోటీ చేయడానికి కాంగ్రెసుకు అభ్యర్థులు కావాలంటూ పేర్కొన్నారని ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. సింహం జూలు విదిల్చిన చందంగా కాంగ్రెసు పార్టీలో కడప నుండి పోటీ చేయడానికి చాలా మంది ఉన్నారన్నారు. అయితే ఎవరిని పోటీ చేయించాలో నిర్ణయించుకోవడానికి అధిష్టానం అనుమతి అవసరం ఉంటుందని చెప్పారు. మాకు అభ్యర్థుల కొరత లేదన్నారు. ఆ పత్రికలో వచ్చిన ఆల్ ఫ్రీపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ త్యాగధనుల పార్టీ అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాన మంత్రి పదవిని వదులుకున్న త్యాగధనురాలు అన్నారు. అలాంటి పార్టీలో ఎవరో వరాలు అడిగినట్టు, ఇవ్వాలన్నట్లు చెప్పడం అవాస్తవమన్నారు.