కడప బరిలో డీఎల్!
posted on Apr 8, 2011 9:01AM
హైదరాబాద్: కడప లోక్ సభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌పై కాంగ్రెసు అభ్యర్థిగా మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి పోటీకి దిగడం ఖాయమై పోయింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో రవీంద్రా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కందుల సోదరులు పోటీకి విముఖత చూపడంతో కాంగ్రెస్ చివరకు డీఎల్‌ను ఖరారు చేయాల్సి వచ్చింది. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా మంత్రి పేరునే ప్రతిపాదించారు. చివరకు ఆయన పేరునే అధిష్ఠానం ఆమోదం కోసం పంపారు. శుక్రవారం డీఎల్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తామని పార్టీవర్గాలు వెల్లడించాయి. మొదటి నుంచీ డీఎల్ పేరే చర్చల్లో ఉన్నా ఆయన సుముఖంగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న కందుల రాజమోహన్‌రెడ్డిని తీసుకొచ్చి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన విముఖత చూపడంతో సోదరుడు కందుల శివానందరెడ్డినైనా బరిలోకి దించాలనుకున్నారు. ఇందులో భాగంగానే డీఎల్ గురువారం కందుల సోదరులతో వారి నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయినా వారు అంగీకరించలేదు. దీంతో డీఎల్, మంత్రి అహ్మదుల్లా, ఆ పార్టీ జిల్లా నేతలు వీరశివారెడ్డి, వరదరాజులురెడ్డి, చెంగల్రాయుడు, రమేష్‌రెడ్డి ఇతర నాయకులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే డీఎల్ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.