జగన్ వ్యాపారాలపై డీఎల్ దృష్టి
posted on Apr 10, 2011 @ 3:06PM
కడప: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు పోలీసు స్టేషన్‌లో కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌పై క్రిమినల్ కేసు నమోదయింది. అయితే దానిని మంత్రి డిఎల్ ధృవీకరించారు. అంతేకాదు ఆయన గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ వ్యాపారాలపై వ్యాఖ్యలు కూడా చేశారు. బ్రాహ్మిణి స్టీల్స్ విషయంలో యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో యాక్సిస్ బ్యాంకు నుండి రూ.350 కోట్లు తీసుకున్నారని అన్నారు. రాయల్టీలు చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణితో పాటు భారతీలో కూడా జీరో వ్యాపారం సాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైయస్ బొమ్మ పెట్టుకునే హక్కు కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని, జగన్‌కు లేదని డిఎల్ అన్నారు.