రాజీనామాను ఆమోదింపచేసుకున్న వివేకా
posted on Apr 10, 2011 @ 9:44AM
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌కు పంపించారు. అదేవిధంగా కడప జిల్లాకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జులు, మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కడప, పులివెందుల స్థానాలకు వచ్చే నెల ఎనిమిదో తేదీన ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో భాగంగా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్.వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేకేఆర్ తిరస్కరించారు. అయితే, వైఎస్.వివేకానంద రెడ్డి మాత్రం ఏమాత్రం పట్టువీడకుండా తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వివేకా రాజీనామాపై ఆమోదముద్ర వేశారు. రాజీనామా ఆమోదంతో వైఎస్.వివేకా ఇకపై ఉప ఎన్నికల ప్రచారంలో మరింతగా నిమగ్నం కానున్నారు.