మంత్రులకు ప్రచార బాధ్యతలు
posted on Apr 10, 2011 @ 11:43AM
హైదరాబాద్: కడప లోక్'సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు నియోజవర్గానికి ఒక మంత్రిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉప ఎన్నిలలో అనుసరించవలసిన వ్యూహంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మంత్రులకు ఎలా ప్రచారం చేయాలో కిరణ్ కుమార్ కొన్ని సూచనలు చేశారు. ప్రచారంలో ఎక్కడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించవద్దని చెప్పారు. వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అన్నారు. వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను ఓటర్లలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. సోనియాను వైయస్ పొగిడిని సీడీలే ప్రధానం అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొనాలని సూచించారు. ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇంఛార్జులుగా నియమించారు. కపడ నియోజకవర్గానికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కమలాపురం నియోజకవర్గానికి మంత్రి రఘువీరారెడ్డి, పులివెందులకు ఆనం రామనారాయణ రెడ్డి, జమ్మలమడుగుకు బొత్స సత్యనారాయణ, బద్వేలుకు మహీధర రెడ్డి, ప్రొద్దుటూరు టిజి వెంకటేష్, మైదుకూరుకు మంత్రి ధర్మాన ప్రసాదరావులను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కాగా సమావేశం అనంతరం మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. జగన్ కారణంగానే ఎన్నికలు వచ్చాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నికలు వచ్చేలా చేశారన్నారు. వైయస్ బొమ్మను వాడుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. వైయస్ కాంగ్రెసు సొత్తు అని అన్నారు. వైయస్ జగన్ పార్టీ సొత్తు కాదన్నారు.