అవినీతిపై నారాయణ పోరాటం
posted on Apr 10, 2011 @ 9:57AM
విజయవాడ: సిపిఐ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు 17వ వర్థంతి సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విజయవాడలో 48 గంటల నిరాహార దీక్షను శనివారం చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నారాయణ దీక్షను విజయవాడ తొలి మేయర్ టి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. నారాయణ చేపట్టిన దీక్ష ఆదివారానికి రెండవరోజుకు చేరుకుంది. శిబిరంలో నారాయణతో పాటు పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఉదయం పదిగంటలకు ప్రారంభమైన దీక్ష సోమవారం ఉదయం పదిగంటలవరకు అంతే 48 గంటలపాటు కొనసాగనుంది. పలువురు రాజకీయ పార్టీ నాయకులూ దీక్ష ప్రాంగణానికి వచ్చి నారాయణకు మద్దతు తెలుపుతున్నారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తిమంతంగా మెలిగిన విషయాన్ని గుర్తు చేశారు. అవినీతిపై నిరంతర పోరాటం కొనసాగాల్సిందేనన్నారు. దేశంలో అన్ని విభాగాల్లోనూ అవినీతి ఎక్కువైందన్నారు. 'జన లోక్‌పాల్ బిల్లు' పెట్టినంత మాత్రాన అవినీతి అంతం కాదనీ, దాన్ని సమర్థవంతంగా అమలు చేయించేందుకు నిత్యం పోరాటాలు కొనసాగాల్సిందేననీ చెప్పారు. 2జి స్పెక్ట్రం, కామన్వెల్త్ క్రీడలు, ఆదర్శ హౌసింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లోనూ అవినీతి వ్యతిరేక పోరాటాలు సాగినప్పుడే అవినీతి అంతమవుతుందన్నారు.