కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి
posted on Apr 10, 2011 @ 10:25AM
భద్రాచలం : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 12న అంగరంగ వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. కల్యాణానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో అప్పడే భక్తుల తాకిడి పెరిగింది. ఒకవైపు పుష్కర పట్టాభిషేకంలో భాగంగా శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, అహోబిల రామానుజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామాయణ మహా క్రతువు జరుగుతోంది. అంతే కాకుండా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భద్రాద్రికి తరలివస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని కనులారా వీక్షించేందుకు భక్తులు ఈ ఏడాది ముందుగానే చేరుకుంటున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, 13న గవర్నర్ నర్సింహన్ రానుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు రానుండటంతో జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా ఆధ్వర్యంలో 3 వేల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.