హజారేను విభేదించిన రాందేవ్ బాబా
posted on Apr 10, 2011 @ 2:36PM
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌పై సంఘ సంస్కర్త అన్నాహజారేకు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మధ్య విభేదాలు కనిపించాయి. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే ఎన్నుకున్న ఐదుగురు సభ్యులలో శాంతి భూషణ్ ఆయన తనయుడికి ప్యానెల్‌లో చోటు కల్పించడంపై రాందేవ్ బాబా ప్రశ్నించారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరి వ్యక్తులకు ప్యానెల్‌లో చోటు కల్పించడంపై రాందేవ్ ప్రశ్నించారు. కాగా రాందేవ్ బాబా వ్యాఖ్యలను అన్నాహజారే ఖండించారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక జరిగిందని ఆయన చెప్పారు. కాగా ఒకే కుటుంబం నుండి ఇద్దరిని ఎంపిక చేయడంపై మాత్రం స్పందించనట్టుగా సమాచారం.
కాగా, డెకాయిట్ల మాదిరి దోపిడీ చేసిన మంత్రులే జనలోక్'పాల్ బిల్లు కమిటీలో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధాన మంత్రికి కూడా మినహాయింపులేకుండా బిల్లు పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీలో అన్ని పార్టీలకు స్థానం కల్పించాలన్నారు. అలా కాకుంటే ఈ కమిటీ వృధా అన్నారు.