కమిటీ నుంచి తప్పుకోమన్న హజారే
posted on Apr 12, 2011 @ 11:40AM
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగదని కేంద్ర టెలికామ్ శాఖామంత్రి కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే తీవ్రంగా మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజా సమస్యలు పరిష్కరించదని భావిస్తే.. ముసాయిదా రూపకల్పన కోసం రూపొందించే సంయుక్త కమిటీ నుంచి తప్పుకోవచ్చని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. అంతేకాకుండా, పౌర సమాజం నాయకులు కిరణ్ బేడి, అరవింద్ కజ్రేవాలా సైతం ఇదే వాదనతో కపిల్ సిబల్‌పై ఎదురు దాడికి దిగారు. కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి కపిల్ సిబల్ వ్యాఖ్యలు చాలన్నారు. లోక్‌పాల్ బిల్లు వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని భావిస్తున్న కపిల్ సిబల్ సంయుక్త కమిటీలో కొనసాగటం ద్వారా తన సమయాన్ని, మా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని నిలదీశారు.
ఇలాంటి వారు కమిటీలో కొనసాగటం ద్వారా సమయాన్ని వృథా చేసే బదులు తప్పుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. లోక్‌పాల్ బిల్లు విషయంలో తీవ్రమైన ప్రకటనలు చేయటం ద్వారా సర్కారుకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. లోక్‌పాల్ చట్టం వలన ఎలాంటి లాభం లేదనుకుంటే సంయుక్త కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సిబల్‌కు ఆయన డిమాండ్ చేశారు. లోక్‌పాల్ బిల్లు తయారు కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తాము ఎదుర్కొంటామన్నారు.