౩ రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం
posted on Apr 12, 2011 9:26AM
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్ఛేరి, కేరళలల్లో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్‌లో ఓటర్లు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. కేరళలో మళయాళీలు చెరోసారి చెరో కూటమికి అధికారాన్ని అప్పగిస్తుండగా, ఈ దఫా అధికార ఎల్‌డిఎఫ్, ప్రతిపక్ష యుడిఎఫ్ నువ్వా, నేనా అన్నట్లు ప్రచారం నిర్వహించాయి. తమిళనాట అధికార డిఎంకె మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ప్రజాతీర్పు కోరుతూ ప్రచారం నిర్వహించగా, ప్రతిపక్ష అన్నాడిఎంకె సైతం తానేమీ తీసిపోలేదన్నట్లు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. అధికార డిఎంకె, ప్రతిపక్ష అన్నాడిఎంకెలు ప్రజలకు ఉచిత హామీలనివ్వడంలో పోటీ పడ్డాయి. అంతటితో ఆగక అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలతో ప్రచారాన్ని హోరెత్తించాయి. ఎన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీలన్నీ ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చాయి. తమ పట్ల ఇసి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అధికార డిఎంకె ఆరోపించగా, అదేమీ లేదని ఇసి స్పష్టం చేసింది.
మరోవైపు జయలలిత వివాహంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినందుకు స్టాలిన్‌కు ఇసి నోటీసులు జారీ చేసింది. అన్నా డిఎంకె అధినేత జయలలిత, డిఎండికె అధ్యక్షుడు విజయ్‌కాంత్ తదితరులు సైతం కరుణానిధి కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. ఓటర్లను ప్రలోభ పరిచేందుకు డిఎంకె, అన్నా డిఎంకెలు చేసిన ప్రయత్నాలను ఇసి అధికారులు నియంత్రించి రూ.25 కోట్ల మేరకు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పొరుగునే ఉన్న పుదుచ్ఛేరిలో కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి నారాయణస్వామి, రంగనాథం ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. ఇటు కేరళలో అధికార ఎల్‌డిఎఫ్, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుండగా, అధికారంలోకి వస్తే తాము ఆ పథకాన్ని అమలు చేస్తామని ప్రతిపక్ష యుడిఎఫ్ హామీనిచ్చింది. కాంగ్రెస్ యువనేత రాహుల్, కేరళ సిఎం అచ్యుతానందన్ పరస్పర వ్యాఖ్యలు దుమారం లేపాయి.