సమసిన టీడీపీ కృష్ణాజిల్లా వివాదం
posted on Apr 13, 2011 9:26AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా విభాగంలో కొద్దిరోజులుగా నెలకొన్న వివాదం సమసిపోయింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేసిన ఆ పార్టీ విజయవాడ పట్టాన అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ వెనక్కు తగ్గారు. తొందరపాటులో తప్పు చేసానని, ఆవేశపడ్డానని క్షమించమని కోరారు. ఉమామహేశ్వరరావు నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నందమూరి హరికృష్ణ, పార్టీ అధినేత చంద్రబాబుల మధ్య విభేదాల్లెవని వెల్లడించారు. విజయవాడ పట్టాన పార్టీ అధ్యక్షా పదవికి చేసిన రాజీనామా వంశీ ఉప సంహరించుకున్నట్లు ప్రకటించారు. వంశీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడ పరిణామాలపై చంద్రబాబుకు వంశీ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ అన్ని సమస్యలను ఒక్కోటీ అధిగమించి ఇప్పుడిప్పుడే కడప ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తున్న తరుణంలో ఇరువురు నేతలు విబేధాలతో రోడ్డున పడి పార్టీని భ్రష్టు పట్టిస్తారా? వ్యక్తిగత అజెం డాతో పార్టీకి నష్టం కలిగే విధంగా మీడియాకు ఎక్కుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జీగా పార్టీ ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరికి చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగత విబేధాలు, ఇగోలు పార్టీపై రుద్దడం సరికాదని మందలించినట్లు తెలిసింది.
మరోవైపు చంద్రబాబును కలిశాక వంశీ ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా పార్టీ వ్యవహారంలో తానూ తొందరపాటుగా వ్యవహరించినందుకు క్షమాపణ కోరుతున్నానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తానని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో మరెప్పుడూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించబోనని హామీ ఇస్తున్నట్లు విజయవాడలో విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపారు. చంద్రబాబును కలవడానికి ముందుగ వంశీ జూ.ఎన్టీఆర్ భేటీ అయ్యారని తెలిసింది. కృష్ణా జిల్లాలో జరిగిన వ్యవహారాలు, పార్టీలోని అంతర్గత పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.