భారీ మెజార్టీతో గెలిస్తేనే మంత్రిపదవి చేపడతా
posted on Apr 12, 2011 @ 12:01PM
కడప: పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తేనే తాను మంత్రి పదవి చేపడుతానని వైఎస్.వివేకానంద రెడ్డి అన్నారు. పులివెందుల లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ అనుకోని పరిస్థితుల కారణంగా పులివెందుల, కడప ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపిస్తేనే మంత్రి పదవిని చేపడుతానని ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా పులివెందుల ప్రాంతంలో ఓటమి ఎరుగని నేతగా, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా నిజాయితీగా, నిబద్దతగా ఎటువంటి వారికైనా వారివారి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చానన్నారు. ఇపుడు విధేయతతో వినమృడనై మీ ముందుకు వచ్చానని, ఈ ఎన్నికల్లో నన్ను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, అందుకు మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను ఉప ఎన్నికల్లో గెలవడం వల్ల దివంగత నేత వై.ఎస్ ఆశయాలు నెరవేరుస్తామని చెప్పారు.