టీడీపీ నేతల విస్తృత ప్రచారం
posted on Apr 13, 2011 @ 11:54AM
కడప: కడప పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు బుధవారం నుంచి ప్రచారం చేయనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 90 మంది వరకు ఈ ప్రచార కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు. ఈ ప్రచారానికి వచ్చే ప్రజాప్రతినిధులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలకు కొన్ని ప్రాంతాలను అప్పగించారు. ఆ ప్రాంతాల్లోనే వారు మకాం వేసి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇప్పటికే నేతలకు ఏ ఏ నియోజకవర్గాలకు ఎవరూ ఇన్‌చార్జీలుగా ఉంటారు, ఎవరూ ఏక్కడా బస చేయాలన్న వ్యూహాంపై స్పష్టమైన ప్రణాళిక ఖరారైంది. దాదాపుగా కడప పార్లమెంట్ పరిధిలోని అన్నీ మండలాలలోను నేతలు తిష్ట వేసి ప్రచారం సాగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రచారంలో పాల్గొనే సీనియర్ నేతల్లో ఎర్రంనాయుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బుచ్చయ్యచౌదరి, దేవేందర్‌గౌడ్, లాల్‌జాన్‌బాష, వేణుగోపాలాచారి, అశోక్ గజపతిరాజు వంటి వారు ఉన్నారు.
ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు సాగిస్తున్న ప్రచారాలను, వారి అగడాలను బట్టబయలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు, కడప జిల్లా ఓటర్లకు తెలియవచ్చేలా ఎన్టీఆర్ భవన్‌లో ముగ్గురు అధికార ప్రతినిధులు ప్రతి రోజు మీడియా సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే జిల్లాలో ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి పోలింగ్ బూత్‌లోనూ, తమకంటూ ప్రత్యేక ప్రతినిధి ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుంచి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారం రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న దృష్ట్యా ఈలోపల బాబుకు పూర్తి స్థాయిలో నివేదికను అందిచేందుకు కూడా ప్రక్రియ మొదలైంది.