అభివృద్దికి ఆమడ దూరంలో ఆదివాసీలు
posted on Aug 10, 2012 8:46AM
అభివృద్ది ముసుగులో ప్రభుత్వాలు ఆదీవాసీల ఉనికినే దెబ్బతీస్తున్నాయి. వారి సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఆదీవాసీలకు లభించాల్సిన ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయి. రాజ్యాంగంలోని 244,275 నిబంధనలు, ఐదవ షెడ్యూల్‌లోని పాలనా విధానాలూ గిరిజనులకు సాధికారతను కల్పించే రాజ్యాంగం లోని 73 సవరణలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కేంద్రంనుండి రాష్ట్రానికి నిధులు విడుదల అవుతున్నా అవి ప్రక్కదారి పడుతున్నాయి.
జనాభా ప్రాతిపదికన విడుదల అవుతున్న సబ్‌ప్లాన్ నిధులు,ఏజెన్సీ ప్రజల మంచినీటికోసం వెచ్చించే నిధులు దారి తప్పుతున్నాయి. గిరిజనాభివృద్దికి వస్తున్న కోట్లాదిరూపాయలను ఇతర రంగాలకు మళ్లించి గిరి పుత్రుల కడుపు కొడుతున్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కావడం శోచనీయం. గిరిజనులకు ఉండే భూములను ప్రాజెక్టుల క్రింద ముంచేసి వారికి ఉన్న కొద్ది పాటి జీవానాధారం కూడా లేకుండా చేస్తున్నారు. మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తూర్పు,పశ్చిమ గోదావరిజిల్లాల్లోనూ, ఖమ్మం జిల్లాలోనూ 300 ఆదీవాసీ గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో వేలాది గిరిజన కుటుంబాలు నిరాశ్రయం అవుతున్నాయి. బాక్సైట్ తవ్వకాల పేరుతోవందలాది తండాలను బలవంతంగా తరలిస్తున్నారు. పారిశ్రామిక కార్యకలాపాలతో ఉత్తరాంద్రలోని ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా పోయింది. గిరిజనులు సేకరించుకునే అటవీ ఉత్పత్తులు స్వేచ్చగా అమ్ముకునేందుకు కూడా అధికారులు అడ్డు పడుతున్నారు. పాత పద్దతిలో పోడు వ్యవసాయం చేయడం, తాతముత్తాతల కాలంనాటి వ్యవసాయ పనిముట్లు వాడటం వల్ల దిగుబడులు తగినంతగా లేక గిరిజనుల బ్రతుకులు దుర్బరంగా మారాయి. గిరిజనోద్దరణకు ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృధ్ది (ఐటిడిఎ) సంస్ధ ద్వారా కోట్ల రూపాయలు కెటాయిస్తున్నా ఆదీవాసీ జీవితాల్లో వెలుగులేకపోవడం 65 ఏళ్ల స్వతంత్య్ర భారతావనికి మాయని మచ్చ. ఇప్పటికైనా పాలకులు ఆదీవాసీల అభివృద్దికి చిత్తశుద్దితో పాటుపడాలి.