గుర్తింపు కోసం తెగబడుతున్న మావోయిస్టులు?
posted on Aug 9, 2012 @ 12:51PM
కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల ఊచకోత కోయటం ద్వారా తమ సత్తా చాటుకున్నాయని ప్రచారం ఎక్కువైంది. ఈ ప్రచారం నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులతో నేరుగా తలపడేందుకు సిద్ధపడుతున్నారు. రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తిరిగి పోలీసులను కవ్విస్తూనే ఎదుర్కోవాలని మావోయిస్టు కేంద్రకమిటీ ఆదేశాలిచ్చిందని సమాచారం. అందుకే మావోయిస్టులు ప్రాణాలకు తెగించి తలపడాలని నిశ్చయించు కున్నారని మన్యం వాతావరణం బట్టి అర్థమవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రహదారి ఒకవైపు విశాఖ, ఒరిస్సా ఏజెన్సీతోనూ, మరోవైపు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ఏజెన్సీతోనూ కలుస్తుంది. అందువల్ల ఆ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టులు తూర్పుఏజెన్సీకి సులభంగా వలస వచ్చేస్తుంటారు. మరోవైపు నల్లమల అడవుల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చేస్తుంటారు. అన్నిటికీ ప్రధానకేంద్రంగా తూర్పుఏజెన్సీ ఉంది. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ పోలీసుస్టేషనుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాను మరణించాడు, మరొకరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దంతెవాడ తరువాత ఘటన తూర్పుఏజెన్సీలోనే జరుగుతుందని జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాల రీత్యా ఛత్తీస్‌ఘడ్‌లో తెగబడిన మావోయిస్టులు తూర్పుగోదావరి ఏజెన్సీలోనూ అదే పంథాలో విజృంభిస్తుంటారు. ఇలా తెగబడినప్పుడు ఎస్‌ఐల స్థాయి అథికారులను కోల్పోయిన చరిత్ర తూర్పుగోదావరి పోలీసులదే. పైగా ప్రధానరహదారిలో ఎదురుకాల్పులు జరుపుకోవటం ఆనవాయితీ. ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ పోలీసుస్టేషనుపై దాడి జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే గిరిజనులు వణికిపోతున్నారు. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసులు కూడా పట్టుదలగా వ్యవహరిస్తారని వారు భయపడుతున్నారు. ఎటువంటి విపత్తు సంభవించినా తమ గుర్తింపును చాటుకోవాలని మావోయిస్టులు సిద్ధపడటంతో భయానకపరిస్థితులు తప్పవని పరిశీలకులు అంటున్నారు.