దానం నాగేందర్‌కు క్లాసుపీకిన బొత్స
posted on Aug 11, 2012 @ 10:18AM
సుప్రీంకోర్టు తీర్పుతో కంగుతిన్న ప్రభుత్వం ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదివే బిసిలకు రిఎంబర్స్‌మెంట్ పాక్షికంగా చెల్లిస్తామనడంతో విద్యార్ధిలోకం ఆందోళన చేపట్టింది. పాత ఫీజలను మాత్రమే చెల్లించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కొత్తగా పెంచిన ఫీజులను విద్యార్దులే చెల్లించాలనటంతో విద్యార్ధులతో పాటు మంత్రులను కలచివేసింది. దాంతో బిసిలలో మంత్రులుగా ఉన్న దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ ఆందోళనాకారులతో తమ గొంతుకూడా కలిపారు. అవసరమయితే తమ పదవులను త్యాగం చేస్తామని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రకటనలు చేశారు. చేయిదాటిపోతున్నదనుకున్న పిసిసి ప్రసిడెంట్ వారిని పిలచి తలంటారని బోగట్టా.
ఇంకా ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుపకుండానే ఎందుకు తొందరపడుతున్నారని... సంయమనంగా వ్యవహరించాలని, మంత్రులే ఇలా చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకూడదని హితబోధ చేసి దానంను దారిలోకి తెచ్చుకున్నారు. అదే విధంగా ఇందిరమ్మ బాటలో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లోనే ముఖేష్ గౌడ్‌ను నియంత్రించారు. దీంతో మంత్రివర్గంలో పెను ప్రమాదాన్ని తప్పించారు.ప్రస్తుతం ప్రభుత్వం కూడా బిసి విద్యార్ధుల రీఎంబర్స్‌మెంట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలను తమ నియంత్రణలోనికి తెచ్చుకోవడానికి ఆర్డినెన్స్ జారీ చేసింది.