సోనియాగాంధీ ఒత్తిడికి గురవుతున్నారా ?
posted on Aug 11, 2012 @ 9:57AM
పదమూడు సంవత్సరాలనుండి రాజకీయాలలో రాణిస్తున్నా ఏనాడూ సంయమనం కోల్పోని సోనియా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజు అద్యాని వాఖ్యలమీద, తెలంగాణ కాంగ్రెస్‌వారిమీద విరుచుకుపడటం స్వపక్ష, ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడటం లేదు. సోనియా వత్తిడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణమని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ట్రబుల్‌షూటర్‌గా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కావడంతో పార్లమెంటులో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొనే సత్తాగల నాయకులు పార్టీలో లేనందువల్ల ఆ భాద్యతలు కూడా సోనియానే చేపట్టవలసి వచ్చింది.
రాహుల్‌ను ప్రధాన మంత్రి చేసే విషయంలో కూడా ఆమె తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. భావి ప్రధానిగా ఉండాలంటే తప్పకుండా స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ చేజిక్కించుకోవాలని రాహుల్ షరతువిధించిట్లు తెలిసింది. అలాగే చీటికి మాటికి యుపిఎ సభ్యులు అరచిగోలపెట్టటం, రాష్ట్రపతి ఎన్నికల్లో అనైక్యంగా ఉన్న ఎన్‌డిఎ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఐక్యంగా అభ్యర్ధిని నిలవటం సోనియాను ఒత్తిడికి గురిచేసింది. భాగసామ్య పక్షమైన సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఒకసందర్బంలో కాంగ్రెస్‌ను రానున్న ఎన్నికల్లో ఓటమి చెందే పార్టీగా పేర్కోటం, వచ్చే ఆరునెలల్లో గుజరాత్‌తో సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్దపడవలసిరావడం సోనియాకు కత్తిమీద సాము. అసోంలో కాంగ్రెస్‌పాలనలో హింసాకాండ చెలరేగటంతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పవలసిరావడం కూడా సోనియా వత్తిడికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సోనియా తాను ఉగ్రరూపం ధరించడమేకాక తమ సభ్యులను కూడా రెచ్చగొట్టటం ఆశ్చర్యపరచిన విషయం. దీంతో ప్రతి విషయాన్ని ప్రభుత్వ అవినీతితో ముడిపెట్టే ప్రతిపక్షాలను సహించరాదని ఆమె తమ సభ్యులకు స్పష్టం చేసినట్టయ్యింది. దేశంలోని వర్షాభావ పరిస్థితులు, తద్వారా దుర్బిక్ష పరిస్తితులు సోనియాకు సవాల్ విసురుతున్నాయి. ఆర్దిక మాంద్యం తగ్గించాలంటే రిటైల్‌రంగంలో విదేశీపెట్టుబడులు ఆహ్వానించక తప్పని పరిస్దితి. దీన్ని అమలు చేయాలంటే మమతబెనర్జీ, ములాయంసింగ్ అంగీకరించవలసి ఉంది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వ పనితీరు అనేక విమర్శలకు గురికావడం సోనియాను కలవరపెడుతుంది.