తెలంగాణా అర్చకుల ఆందోళన
posted on Aug 10, 2012 8:42AM
ఇప్పటికే పలు రకాల ఆందోళనలతో అట్టడికి పోతున్న తెలంగాణలో మరో ఆందోళన ప్రారంభం అయ్యింది. తెలంగాణ అర్చకులు తమ డిమాండ్ల సాధనకౖ ఆందోళన చేపట్టారు. తమకు జీవో నెంబర్ 16 ఎ ప్రకారం ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ఆలయ అర్చకులు నిరసన బాట పట్టారు. అర్చకుల నిరసనలతో దేవతా మూర్తులకు పూజలు నిలచిపోయాయి. దీంతో నిత్యం భక్తులతో రద్దీగా వుండే దేవాలయాలు బోసిపోయాయి. భక్తుల కోరికలు తీర్చే దేవుడికే సేవ చేస్తున్నా తమ బాధలు పట్టించుకోనే నాధుడే కరువయ్యాడని పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవాలయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉపాద్యాయులకు ఇస్తున్నట్లుగానే తమకు వేతనం ట్రెజరీల ద్వారా చెల్లించాలని అర్చకులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అర్చకులు ఆందోళన బాట పట్టడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి , మెదక్ ఏడుపాయల వనలక్ష్మీదేవి, బొంతపల్లి వీరభద్రస్వామి, సిద్దిపేట వెంకన్న లాంటి ప్రధాన ఆలయాల్లో పూజలు ఆగిపోయాయి. తెలంగాణావ్యాప్తంగా 12 వేల ఆలయాలున్నాయని అన్నిటిలోనూ ఆర్జిత సేవలను నిలిపివేయాలని అర్చక సంఘం పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఈనెల 14 వరకు అర్చకులు ఆర్జిత సేవలు నిలిపి వేయనున్నారు. దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ఆర్ధిక ఇబ్బందులతో బ్రతుకు దుర్బంరంగా వుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం సత్వరమే స్పందించాలని లేకుంటే ఈ నెల 14 నుండి ఆందోళన ఉదృతం చేస్తామని తెలంగాణ అర్చకులు హెచ్చరిస్తున్నారు.