వైద్యులు లేకండానే ఆస్పత్రులు నడిపేస్తున్న ప్రభుత్వం!
posted on Aug 9, 2012 @ 11:48AM
గుంటూరు జిల్లాలోని పిహెచ్‌సిల్లో వైద్యం అందని ద్రాక్షలా మారిందని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అస్సలు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారని తెలిసి ఇటీవలే జిల్లా వైద్యశాఖాధికారులు వారినుంచి స్థానికంగా నివాస ముంటామని హామీ పత్రాలు తీసుకున్నారు. జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు(పిహెచ్‌సి)లు ఉన్నాయి. అలానే ఎనిమిది వైద్యవిధానపరిషత్తు ఆసుపత్రులున్నాయి.
మొత్తం ఈ ఆసుపత్రుల్లో 175మంది డాక్టర్లు(వైద్యులు) పని చేస్తున్నారు. వీరంతా పని చేసే చోట నివాసముండటం లేదు. దీంతో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సీరియస్‌గా పరిగణించి పిహెచ్‌సి సమీపంలో ఉండలేమన్న 22 మంది వైద్యులను గుర్తించింది. వీరికి ఇచ్చే అద్దెభృతి(హౌస్‌అలవెన్సు) మూడు వేల రూపాయలు ఆపుజేసింది. వీరిని చూసి మిగిలిన వైద్యులైనా పిహెచ్‌సి ప్రాంతాల్లోనే నివసిశిస్తారని భావించింది. కానీ, వైద్యులు ఈ చర్యలను కూడా లెక్క చేయటం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వైద్యం అందటం లేదు. చిన్న సమస్య వచ్చినా జిల్లా ఆసుపత్రికి వచ్చే పరిస్థితుల్లో గ్రామీణులున్నారు. వైద్యఆరోగ్యశాఖ మహిళాక్షేత్ర సిబ్బందిని నియమించేటప్పుడే స్థానికంగా నివాసం ఉండాలని ఆంక్షలు విథించింది. మొత్తం 42మంది మహిళాక్షేత్రసిబ్బంది చేత స్థానికంగా నివాసముంటామని రాతపూర్వకంగా తీసుకుంది. ఈ హామీ తీసుకున్న తరువాతే వారిని విథులకు పంపించింది. వైద్యుల విషయంలో ప్రేక్షకపాత్ర పోషించటం కన్నా నివేదిక తెప్పించుకునైనా చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు వైద్యఆరోగ్యశాఖను కోరుతున్నారు. అసలే వర్షాకాలం జ్వరాలు సోకే సీజన్ కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.