అమ్మకానికి మహబూబ్‌నగర్ కలెక్టరేట్
posted on Jul 17, 2012 @ 2:18PM
ప్రైవేటు వ్యక్తుల నుంచి బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం భూమి సేకరించిన ప్రభుత్వయంత్రాంగం బాకీ పడ్డ సొమ్ము చెల్లించేందుకు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌ను, అంబేద్కర్ భవనాన్ని అమ్మేయాలని సీనియర్‌సివిల్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమవుతోంది. భూమిపై యజమానుల హక్కులను కాపాడేతీర్పుల్లో ఇది ఒకటని పలువురు న్యాయవాదులు ప్రశంసిస్తున్నారు. 1986లో మూడు ఎకరాల నాలుగు కుంటల భూమిని బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం సేకరించారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులది. ప్రైవేటువ్యక్తుల నుంచి భూమి సేకరించినప్పుడు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలున్నా అథికారులు నామమాత్రంగా ముట్టజెప్పి బాకీ చెల్లించటం మానేశారు. అథికారులు తమ ఇతర కార్యక్రమాల్లో పడి నిర్లక్ష్యం చేయటంతో భూ యజమానులు సీనియర్‌సివిల్‌కోర్టును ఆశ్రయించారు. 25ఏళ్ల తరువాత న్యాయమూర్తి ఓ సంచలన తీర్పును వెలువరించారు. ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నందున న్యాయమూర్తి జిల్లా కలెక్టరేట్‌ను, అంబేద్కర్‌భవనాన్ని అమ్మేసి అయినా బాకీ తీర్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ తీర్పు జిల్లాలో ఎంత సంచలనమైందంటే ప్రతీప్రాంతంలోనూ కలెక్టరేట్‌ను అమ్మేస్తారట అని చర్చించుకుంటున్నారు.