బాలయ్యకు బ్రేక్‌లు వేస్తున్న చంద్రబాబు?
posted on Jul 17, 2012 @ 2:14PM
తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శిగా సినీ హీరో నందమూరి బాలకృష్ణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల టిడిపి అథినేత చంద్రబాబు ముందు తన అంతరంగాన్ని ఉంచిన బాలయ్య ఇప్పుడు ఏ పదవైతే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించటానికి అవకాశ ముంటుందో తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ప్రధాన కార్యదర్శి అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తాను గుర్తింపు తెచ్చుకోవచ్చని బాలయ్య భావిస్తున్నారట. అంతే కాకుండా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి కృష్ణాజిల్లాలోని గుడివాడ అసెంబ్లీ కానీ, హిందుపురం కానీ అయితే బాగుంటుందని కూడా బాలయ్య అభిప్రాయపడుతున్నారట. ఈ రెండు విషయాలను మరో వారంలోపు చంద్రబాబు ముందుంచి తాను తెలుగుదేశం పార్టీ తరుపున అందరినీ కలుస్తానని బాలయ్య తన సన్నిహితులకు చెబుతున్నారట.
తన కుమారుడు నారా లోకేశ్‌ను రంగంలోకి దింపే సమయంలో బాలకృష్ణ రాజకీయతెరపైకి రావటం ఎంతవరకూ బాగుంటుందన్న విషయమై చంద్రబాబు దీర్ఘాలోచన చేస్తున్నారని తెలిసింది. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యత్వం ఇచ్చి బాలయ్యను రాష్ట్రవ్యాప్తంగా తిప్పటమా? బాలయ్య కుమార్తె, తన కోడలును రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా యువరక్తంతో రాజకీయాల్లో సంచలనం సృష్టించటామా? అన్న ప్రశ్నలు చంద్రబాబును వేధిస్తున్నాయట. అందుకే తనకు స్పష్టత వచ్చాక మాట్లాడదామని పార్టీ కార్యక్రమాల్లో బాబు బిజీ అయ్యారని తెలిసింది. అయితే ఈ బిజీలో కూడా పొలిట్‌బ్యూరో సభ్యులతో తన ఆలోచనలు ఆయన పంచుకుంటున్నారట. చివరికి బాలయ్యకు తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి పదవి ఇచ్చేందుకు పార్టీలోని పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా సన్నద్ధంగానే ఉన్నారని సమాచారం.