కాంగ్రెస్ న్యూస్ ఛానల్ రాబోతుందా?
posted on Jul 17, 2012 @ 1:01PM
కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా అవసరం నానాటికి పెరుగు తోందని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఒక న్యూస్‌ఛానల్, ఒక పత్రిక ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోవచ్చని మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. ఎంత కష్టపడి మంచి పథకాలు ప్రవేశపెట్టినా స్పందన రాకపోవటానికి మీడియా లేకపోవటమే కారణమని మంత్రులు అంటున్నారు. కనీసం ప్రశంసల మాటెలా ఉన్నా అసలు స్పందన కూడా రాకుండా కొన్ని మీడియా సంస్థలు అడ్డుపడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
సొంతఛానల్ అయితే తమ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను యథాతథంగా ప్రచారం చేయవచ్చని, దీని వల్ల ప్రశంసలు కూడా వచ్చే అవకాశాలున్నాయని మంత్రులు తేల్చేశారు. దీనికి సమాధానమిస్తూ మంత్రి రఘవీరారెడ్డి కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సొంత మీడియా ఉందని గుర్తు చేశారు. ఆ ప్రత్యేక మీడియా మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందని చెప్పారు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఉన్న మీడియాను మనదారిలో తెచ్చుకుంటే సరిపోతుందని నచ్చచెబుతున్నారు. చివరికి రాష్ట్రంలో సొంత మీడియా గురించి కాంగ్రెస్ పార్టీ యోచించాలని మంత్రులు కోరారు. మంత్రి ధర్మాన నేతృత్వంలోని మంత్రివర్గ ఉపకమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందరు మంత్రులను హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం అందుకున్న మంత్రుల్లో కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. హాజరైన మంత్రులు పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
వాటిలో మీడియా గురించి, తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం గురించి, ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకాభిప్రాయానికి రావాలనే పలు అంశాలపై చర్చ సాగింది. రేషనుకార్డులు నిరంతర ప్రక్రియగా మార్చకపోవటం వల్ల కూడా నష్టం జరిగిందని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. ఇక ప్రతీనెలా ఏదో ఒక ఎన్నికల ద్వారా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని మంత్రులు పార్టీకి సూచించారు.