ఇక విద్యా రుణాలకు బ్యాంకుల చుట్టూ తిరగక్కరలేదు?
posted on Jul 17, 2012 @ 2:16PM
పేద విద్యార్థుల ఉన్నతచదువు కోసం త్వరలో విద్యాఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీనికి కేంద్రస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పేద విద్యార్థుల కోసం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి స్పష్టం చేశారు. ఉన్నత విద్య కోసం బ్యాంకుల చుట్టూ పేదవిద్యార్థుల తల్లిదండ్రులు తిరిగే శ్రమను ఈ ఆర్థిక కార్పొరేషన్లు తగ్గిస్తాయని ఆమె వివరించారు. కొన్ని బ్యాంకులు ఈ రుణాలు ఇవ్వటానికి ఆసక్తి చూపటం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ధరఖాస్తుల ప్రక్రియ కూడా కార్పొరేషనులో సులభతరమవుతుందని తెలిపారు. ప్రత్యేకించి ప్రతీపేద విద్యార్థి తమ భవిష్యత్తు కోసం చదువుకోవాలనే తపన ఆధారంగానే ఈ కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక వేశామని వివరించారు. ఈ కార్పొరేషనులో అప్పు తీసుకోవటానికీ సరళమైన ప్రక్రియలు కూడా ఉంటాయన్నారు.
ఆమోదం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా తక్షణం మంజూరు చేసే సదుపాయం కూడా కార్పొరేషన్లలో ఉంటుందన్నారు. ఉన్నతవిద్య అభ్యాసనకు బ్యాంకులు అనుసరించే విధానాన్ని మార్చకుండా అతితక్కువ సమయంలో ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా నిబంధనలు సరళతరం చేశామని పురందరేశ్వరి వివరించారు. పేద విద్యార్థులు త్వరలో ఏర్పాటయ్యే ఈ విద్యాఆర్థిక కార్పొరేషన్లు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.