మెట్రోరైలుకు ప్రణాళిక పూర్తి!
posted on Jul 17, 2012 @ 2:00PM
మెట్రోరైలు ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికను పూర్తి చేశారు. నిర్మాణంపై ఉన్న సందిగ్థత వీడిరది. దీంతో ఎల్‌అండ్‌టి కార్యాచరణకు దిగింది. మెట్రోరైలు స్టేషన్లు, జంక్షన్లు ఎలా నిర్మించాలన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్న ఎల్‌అండ్‌టికి రైల్వే అధికారులు, ఇంజనీర్లు మార్గదర్శనం చేశారు. పిల్లర్లపై ఈ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. రోడ్డువేకు అనుసంధానం గానే 8 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేయనున్నారు. స్టేషను కూడా 30 మీటర్లలో చతురస్రంగా నిర్మించనున్నారు. అంతే కాకుండా స్టేషనులోకి అడుగుపెట్టడానికి ముందే రైల్వేటిక్కెట్టు వెండర్ మిషన్లను ఏర్పాటు చేయబోతున్నారు.
టిక్కెట్టును రీడ్ చేశాక రైల్వేస్టేషనులోకి ప్రవేశించటానికి ఎలక్ట్రానిక్ డోర్‌లను అమర్చనున్నారు. ఫ్లైఓవర్లపైనా కూడా పిల్లర్ల సాయంతో ఈ నిర్మాణాలు సాగుతాయి. వాహనాలు పెట్టుకునేందుకు స్టాండ్లు, పాదాచారులు స్టేషనుకు చేరటానికి 8 మీటర్ల దారులు ఏర్పాటు చేయనున్నారు. అయితే స్టేషన్ల నిర్మాణంలో జంక్షన్లను కూడా నిర్ణయించారు. అమీర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ వంటి కీలకమైన ప్రాంతాల్లో జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషను, సికింద్రాబాద్ రైల్వేస్టేషను కూడా జంక్షన్‌ల్లో కీలకప్రాధాన్యత కల్పించారు. అలానే స్టేషన్ల భద్రత కోసం ప్రయాణీకుల సామాన్లు చెకింగ్ చేసేందుకు ఎలక్ట్రానిక్ మిషన్ల సాయంతో చర్యలు తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రైల్వేఅథికార్లు, ఎల్‌అండ్‌టి ప్రతినిధులు ప్రకటించారు.