త్వరలో కిరణ్ క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమా?
posted on Jul 17, 2012 @ 8:09PM
రాష్ట్రంలో ముఖ్యమంత్రికి , మంత్రులకు సమన్యయ లోపం ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పు గోదావరిలో జరిపిన ఇందిరమ్మబాటలో మరో సారి వెల్లడైంది. దానికి సీనియర్ మంత్రులెవరూ రాకపోవడం, ఎవరికి వారే విడివిడిగా పర్యటనలు జరపటం వల్ల మంత్రులంతా ఏకతాటిపై లేరనితెలుస్తుంది. సీనియర్ మంత్రులు కిరణ్‌కుమార్‌రెడ్డి తమతో చర్చించకుండా ఎప్పటిలాగే తనకుతానుగానే కార్యక్రమాలు చేబడుతున్నారని ఆరోపిస్తున్నారు.
తూర్పుగోదావరిలో కార్యకర్తల మీటింగ్‌ను ప్రారంభించిన బొత్స సత్యన్నారాయణ వారితో ఎక్కువ సమయం గడపకుండానే రెండు మాటలు మాట్లాడగానే చాల్లే....అనటం వారిని నిరాశకు గురిచేసింది. ముఖ్యమంత్రి వచ్చామా, మీటింగ్‌లో మాట్లాడామా....కార్యక్రమం జరిగిందా అన్న చందంగా ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముగించారు. అయినా అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ సమస్యలమీద దృష్టి పెట్టకుండా ప్రజలదృష్టిని మరల్చటానికే ఇందిరమ్మబాట పట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి తానో బ్యాట్స్‌మెన్ అని తనను ఎవరూ అవుట్‌చేయలేరంటూ చేసిన నర్మగర్భవాఖ్యలు, అదృష్టం వుంటే అన్నీ అవేవస్తాయని అందుకుగాను తన స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి వాటంతట అవే వచ్చాయని చెప్పడం పట్ల సీనియర్ మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టం ఎక్కువ కాలం ఎవరి వద్దా ఉండదని త్వరలోనే ఆయన క్లీన్ బౌల్డ్ కావడం ఖాయమని వారు అంటున్నారు.