రాహుల్‌కి రాజకీయాలు అవసరమా?
posted on Jul 21, 2012 @ 9:50AM
ఇక కీలక బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్దమని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇదే విషయమై స్వపక్ష్యం, ప్రతిపక్షాలనుండి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. ప్రణబ్ రాష్ట్రపతి పదవికి పోటీచేయడంతో ఏర్పడిన గ్యాప్‌ను నింపడానికే రాహుల్‌గాంధీని క్రియాశీలక పాత్రలోకి తెస్తున్నారంటున్నారు. తరతరాలుగా దేశంకోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల కుటుంబం నుండి వచ్చారన్న భజన తప్ప నాయకత్వ లక్షణాలుగాని, సైద్దాంతిక లక్షణాలు గాని రాహుల్ లో కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ప్రత్యర్థులపై ఆయన ప్రభావం శూన్యం. దేశాన్ని మున్ముందు ఎలా నడిపించాలన్న ఎజెండా ఏమీ ఆయన దగ్గరనుండి ఆశించలేము అని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నారు. మొదటి ప్రధానిగా భారతదేశాన్ని సుస్థిరం చేసిన ఘనత ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉంది. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆయన దేశానికి జవసత్యాలు అందించారు. ఆ తర్వాత ప్రధాని అయిన లాల్‌బహదుర్ శాస్త్రి ఎక్కువకాలం ప్రధానిగా లేరు. ఆయన ఆకస్మిక మృతితో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా 20 పధకాలతో ముందుకుసాగారు. ఆమె తరువాత రాజీవ్‌గాంధీ ఐ.టి. యుగానికి బాటలు వేసి యువతరంలో ఉత్సాహం నింపారు. వీరి వారసుడైన రాహుల్‌కు వారి లక్షణాల్లో ఒక్కటి కూడా అబ్బలేదని ఆయనను సన్నిహితంగా పరిశీలిస్తున్నవారు అంటున్నారు.
మొన్న జరిగిన యుపి ఎన్నికలో రాహుల్ చమటోడ్చి పనిచేసినప్పటికి ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌కి ఉన్న ఒకే ఒక అస్త్రం రాహుల్ మాత్రమే. ఆయన వల్ల పార్టీకి ఇప్పటిదాకా పెద్ద ప్రయోజనం చేకూరలేదు. ఒకవేళ ఆయన ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా సందేహాలు ఉన్నాయి. బాబారామ్‌దేవ్ , అన్నా హజారే ల సత్యాగ్రహాలను ఆయన చులకన చేసి మాట్లాడడం, దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కోంటున్నా ఆయన ఏనాడు పార్లమెంట్‌లో వాటిని ప్రస్తావించకపోవడాన్ని చూస్తే ఆయన కు ప్రభుత్వ వ్యవహాహారలపై కూడా ఆవగాహన లేదనిపిస్తోంది.
స్వపక్షం రాహుల్ జపం చేయడమేకాని దేశంలో ఎవరికీ ప్రిన్స్ మీద అంచనాలు లేవని తెలుస్తుంది. త్వరలో గుజరాత్ ,హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగబోయే ఎన్నికల్లో గాని ఆ తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో గాని రాహుల్ చరిస్మా ఎంతవరకు పనిచేస్తుందో అనుమానమే. కాబట్టి పార్టీ పరంగాకాని, ప్రభుత్వ పరంగా కాని రాహుల్ గాంధీ క్రియాశీలక పాత్ర పై ఆశలు పెట్టుకుంటే అత్యాశే అవుతుంది.