జగన్ నిలుస్తాడా? కలుస్తాడా?
posted on Jul 19, 2012 @ 4:17PM
వైసిపి నేతజగన్ పై సిబిఐ జోరు తగ్గింది. దానికి కారణం ప్రణబ్‌కు వోట్లు వేయడమేనని అందరికీ తెలుసు. రానున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి కే ఓటు వేస్తామని వైపిపి ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో వైసిపి మధ్య అవగాహన మరింత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతికి ఓటు వేయటానికి అభ్యంతరం తెలుపని సిబిఐ కోర్టు రానున్న రోజుల్లో బెయిల్ పై కూడా కౌంటర్ చార్జిషీటును పెట్టదని, అలాగే అభ్యంతరం కూడా తెలుపదని అనుకుంటున్నారు.
మొన్నటివరకు ఉప్పు నిప్పులాగా ఉన్న కేంద్రం, వైసిపి పార్టీ కూల్ గా కనిపించడంతో ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. వైసిపి పార్టీ ఎలాగూ కాంగ్రెస్ తాను లో గుడ్డే కాబట్టి కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రధాన ప్రతిపక్షాలు. క్విడ్ ప్రో కొ కేసులో జగన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇది అప్పటి ప్రభుత్వానికి సంభందించింది. నేను దాని పరిధిలోనికి రాను అంటూ వైయస్ జగన్ కోర్టులో అప్పీలు చేసుకున్న నేపధ్యంలో సుప్రీం కోర్టు అప్పటి మంత్రులకు కూడ నోటీసులు జారీ చేసింది.
దాని పరణామ క్రమంలో మంత్రులు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రభుత్వం వారిని సమర్ధించిన కారణంగా జగన్‌కు ఊరట కల్పించినట్లయింది. దీనికి తోడు ఇటీవల వైసిపి గౌరవాద్యక్షురాలు విజయలక్ష్మీ ప్రధాన మంత్రిని, ఇతర మంత్రులను కలిసిన తరువాత ఇక్కడ వైసిపి నేతల మీద కాంగ్రెస్‌నేతలు, సిబిఐ జోరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అందువల్ల రానున్న రోజుల్లో వైసిపి కాంగ్రెస్‌లో కలిపోనుందనే ప్రతిపక్షాలు జోస్యం చెబుతున్నారు. అయితే యువనేత జగన్ మడమతిప్పని నేతగా ఉంటారో లేదా రాజకీయాలలో శాశ్వత మిత్రులుగాని శాశ్వత శత్రువులుగాని ఉండరని మరోసారి ఋజువు చేస్తారో తెలియాలంటే కొంచెం ఓపిక పట్టాల్సిందే.