రాష్ట్రపతి ఎన్నిక లో వోటు వేసినందుకు టీడీపీ ఎమెల్యేల సస్పెన్షన్
posted on Jul 20, 2012 @ 7:14PM
నిన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వోటింగ్ లో పాల్గొన్నందుకు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, బాలనాగిరెడ్డిలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టిడిపి ఎమ్మెల్యేలు ఐదుగురు ఓటు వేశారు. మరో ఎమ్మెల్యే కొడాలి నానిని కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మని కలిసిన రోజునే సస్పెండ్ చేశారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం పై స్పందిస్తూ పరిగి ఎమెల్యే హరీశ్వర రెడ్డి, "పార్టీ కాదు తనని సస్పెండ్ చేసింది ... తానే పార్టీను సస్పెండ్ చేసానని" అన్నారు. తను సంవత్సరంన్నర క్రితమే తెలంగాణ వ్యతిరేకి అయిన తెలుగు దేశం పార్టీని విదిచిపెట్టానని, ఈ రోజు కొత్తగా పార్టీ నుండి బయటకు వచ్చిందేమీ లేదని అన్నారు. నూజివీడు ఎమెల్యే చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ తానూ ఎప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనను పార్టీనుండి బయటకు పంపే ప్రయత్నాలు జరిగాయని అన్నారు.