సింగరేణిపై సమరభేరి
posted on Jul 20, 2012 8:42AM
సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలు పర్యావరణంపై ప్రభావం చూపుతోందని ఇటీవల తాజాపరిశోథనలు తేల్చి చెబుతున్నాయి. ఈ గనుల తవ్వకాల సమయంలో వచ్చే పొగ వంటివి కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వైద్యనిపుణులు ధృవీకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల భూమి కుంగిపోతోందని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తవ్వకాల కోసం వాడే మిషనరీ వేగం వల్ల సమీప గ్రామాల్లో భూమి కొద్ది కొద్దిగా కంపించి లోతుకు దిగుతోందని గుర్తించారు.
సింగరేణి సమీప గ్రామాల్లో రైతులు ప్రత్యేకించి తమ పొలాల్లో భూమి లోతుపెరిగిందంటున్నారు. ఈ విషయమై యాజమాన్యానికి రైతులందరూ రాసిన వినతి పట్టించుకోలేదు. దీంతో వీరు ప్రత్యక్షచర్యలకు సిద్థమయ్యారు. అదిలాబాద్ జిల్లాలోని ముత్యంపల్లి, కాశీంపేట గ్రామస్తులు సింగరేణి వల్ల కలుగుతున్న దుష్ఫలితాలపై మండిపడుతున్నారు. కాశీపేట భూగర్భగని వల్ల తమ భూమి కుంగిందని, ఇలా గనులు తవ్వుకుంటే పోతే కొన్నాళ్లకు భూమి బాగా లోతుకు దిగిపోతుందని వారు పరిశ్రమ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యగా కాశీపేట గనిలో పని చేసే మొదటిషిఫ్టు కార్మికులను అడ్డుకున్నారు. దీంతో ఈ గని ప్రాంతంలో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. యాజమాన్యం కనుక ఎటువంటి చర్యలకు పూనుకోకపోతే కాశీపేట తవ్వకాలు జరగనివ్వబోమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.