దేశం బాణీ ఒంటబట్టించుకున్న నాని?
posted on Jul 21, 2012 9:14AM
తెలుగుదేశం బాణీని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బాగా ఒంటబట్టించుకున్నారు. ఆయన ఆ పార్టీతో మమేకమై ఎంతలా పని చేశారంటే... టిడిపి సస్పెండ్ చేసినా కాంగ్రెస్‌ను విమర్శిస్తే కానీ నిద్రపోలేనంత అలవాటు నానికి ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వీరు చెప్పినట్లే రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఓటు వేశాక నాని తన వ్యాఖ్యానంతో అదరగొట్టేశారు. తరువాత తప్పు అర్థమై మౌనంగా వెళ్లిపోయారు. పిటీషన్ల కమిటీ అధ్యక్షుడు మల్లుభట్టు విక్రమార్కతో ఎమ్మెల్యే కేశవరెడ్డి, రేవంత్‌రెడ్డి ముచ్చటిస్తుండగా నాని వారిని కలిసి పలకరించారు.
ఈ సందర్భంగా 2014 ఎన్నికల గురించి నాని ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఫినీష్ అయిపోతుందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్నికల్లో పోటీ పడతాయని జోస్యం చెప్పారు. అయితే కాంగ్రెస్ ఫినీష్ అనేటప్పుడు నాని ముఖంలో కనిపించిన కసి చూసిన రేవంత్‌రెడ్డి అసలు అప్పుడు జరిగే ఎన్నికల గురించి ఇప్పుడే అంచనా వేయటం కష్టమని తేల్చిచెప్పారు. అంతే కాకుండా ఆ ఎన్నికల నాటికి ఏ పార్టీ ఉంటుందో? ఉండదో? కూడా తెలియటం లేదనీ, ఇప్పుడున్న వాతావరణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం ఈ విషయాన్ని చాటి చెబుతోందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో నాని ఏమీ మాట్లాడలేకపోయారు. మాడిన ముఖంతో తిరుగుపయనమయ్యారు.